‘మగవాళ్లను చంపేయడం ఎలా?’Vs ‘భార్యను బొందపెట్టడం ఎలా?’.. సోషల్ మీడియాలో వింత వార్

by Prasad Jukanti |

మొన్న ‘మగాళ్లను చంపడం ఎలా?’ పుస్తకానికి కౌంటర్‌గా ఇవాళ ‘భార్యను బొందపెట్టడం ఎలా? -RGV’ బుక్ వైరల్ అవుతోంది.

‘మగవాళ్లను చంపేయడం ఎలా?’Vs ‘భార్యను బొందపెట్టడం ఎలా?’.. సోషల్ మీడియాలో వింత వార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవలి కాలంలో క్రైమ్ స్టోరీలు, సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలకు ఆదరణ పెరుగుతోంది. అయితే ఇవి సినిమాల వరకే పరిమితం అయితే పర్వాలేదు. కానీ కొన్ని సినిమాలు సమాజంలో జరుగుతున్న నేరాలకు మార్గదర్శకంగా మారుతుంటే మరికొన్ని క్రైమ్స్.. సినిమాలనే తలదన్నే రీతిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా జీవితాంతం ఒకరికొకరం తోడు నీడగా ఉంటామనే ప్రమాణాలతో ఒక్కటైన భార్యభర్తలు పరాయి సుఖం మోజులోనో, మరో ఇతర కారణాలతోనో నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఇటీవల కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను సియా గోయల్ అనే యువతి దారుణంగా హతమార్చిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా మెట్రో రైళ్లలో మొదలైన ఒక ‘బుక్ వార్’ (పుస్తకాల యుద్ధం) ఇప్పుడు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

మొన్న ‘మగాళ్లను చంపి తప్పించుకోవడం ఎలా?’

కొద్దిరోజుల క్రితం ఒక యువతి మెట్రో రైలులో ప్రయాణిస్తూ బ్రిటీష్ రచయిత్రి క్యాటీ బ్రెంట్ రాసిన "How to Kill Men and Get Away With It" (మగాళ్లను చంపి తప్పించుకోవడం ఎలా?) అనే నవలను చదువుతూ కనిపించింది. అది కేవలం ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఫిక్షన్ పుస్తకమే అయినప్పటికీ.. దేశంలో భర్తలపై భార్యలు చేస్తున్న దాడుల వార్తల నేపథ్యంలో ఆ ఫోటో కాస్తా విపరీతంగా వైరల్ అయ్యింది. ‘సమాజం ఎటు పోతోంది? మెట్రోలో ఇలాంటి పుస్తకాలు చదవడం ఏంటి?’ అంటూ పురుషులు, నెటిజన్ల నుంచి ఆందోళన వ్యక్తం అయింది.

ఇవాళ ‘భార్యను బొంద పెట్టడం ఎలా?’

ఈ వివాదం నడుస్తుండగానే.. మగాళ్లను చంపి తప్పించుకోవడం ఎలా? పుస్తకానికి ‘కౌంటర్’ ఇచ్చేలా తాజాగా మెట్రోలో మరో దృశ్యం వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన చేతిలో "భార్యను బొందపెట్టడం ఎలా? - RGV" అని రాసి ఉన్న ఒక పుస్తకాన్ని పట్టుకుని, ప్రయాణికులందరికీ కనిపించేలా చదవడం ప్రారంభించాడు. ఆ టైటిల్ చూడగానే పక్కనున్న ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొందరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది కాస్తా క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. "మగాళ్లను చంపే పుస్తకానికి మొగుళ్ల పర్ఫెక్ట్ రివెంజ్ కౌంటర్" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి భార్యను బొందపెట్టడం ఎలా? అనే పేరుతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) గానీ ఇతరులెవరూ ఎలాంటి పుస్తకం రాయలేదు. మార్కెట్లో అసలు అలాంటి పుస్తకమే లేదు. మొన్నటి మెట్రో యువతి తెచ్చిన పుస్తకానికి కౌంటర్ ఇవ్వడం కోసం, సదరు వ్యక్తి ఒక ఫేక్ బుక్ కవర్‌ను (Fake Book Cover) క్రియేట్ చేసి, దానికి RGV పేరు తగిలించి, వినూత్నంగా ప్రింట్ తీసుకుని మెట్రోలోకి తెచ్చినట్లు తెలుస్తోంది.

ఫన్నీగానే ఉన్నా.. ఆలోచింపజేసే పరిణామాలు

నెటిజన్లు దీనిని కేవలం ‘మీమ్ మెటీరియల్’గా, ఒక ఫన్నీ వార్‌గా చూసి నవ్వుకుంటున్నప్పటికీ, దీని వెనుక ఉన్న సామాజిక కోణం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు భార్యాభర్తల మధ్య గొడవలు హత్యల దాకా దారితీస్తున్న తరుణంలో.. ఇలా బహిరంగ ప్రదేశాలైన మెట్రో రైళ్లలో ‘భర్తను చంపడం ఎలా?’, ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ అనే శీర్షికలతో పుస్తకాలు (అవి నిజమైనవైనా, నకిలీవైనా) ప్రదర్శితమవ్వడం సమాజంలో మారుతున్న మానసిక పోకడలకు అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. భార్యలు భర్తలను, భర్తలు భార్యలను చంపుకుంటున్న ఘటను పూటకో చోట వెలుగు చూస్తున్న వేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బుక్ వార్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.

Next Story