అర్ధరాత్రి హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థిని

by Jakkula.Mamatha |

హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేక అర్ధరాత్రి వేళ బయటకు వచ్చిన ఓ విద్యార్థినినీ పోలీసులు గుర్తించి సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

అర్ధరాత్రి హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థిని
X

దిశ, జగదేవపూర్: హాస్టల్‌లో ఉండడం ఇష్టం లేక అర్ధరాత్రి వేళ బయటకు వచ్చిన ఓ విద్యార్థినినీ పోలీసులు గుర్తించి సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. శనివారం గజ్వేల్ సిఐ రవికుమార్, జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గుండనపల్లి సమీపంలోని తెలంగాణ మైనార్టీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న గూగులోత్ రితిక హాస్టల్లో ఉండటం ఇష్టం లేక శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుండి బయటకు వచ్చింది.

అదే సమయంలో గజ్వేల్ సిఐ రవికుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రాజీవ్ రహదారిపై ఒంటరిగా వెళ్తున్న విద్యార్థిని కనిపించింది. విద్యార్థిని పిలిచి విచారించగా జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వెంటనే విషయాన్ని జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డికి తెలియజేసి విద్యార్థిని ఎస్సైకి అప్పగించారు. అనంతరం ఎస్సై కృష్ణారెడ్డి రాత్రి 2 గంటల సమయంలో విద్యార్థిని రితికను వట్టిపల్లిలో ఆమె తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు హాస్టల్ నిబంధనలు పాటించాలని ఏమైనా సమస్యలు ఉంటే ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.

Next Story