- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త హత్య.. భార్య, ప్రియునికి ఉరిశిక్ష
భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్యకు, ఆమె ప్రియుడికి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.

దిశ, వెబ్ డెస్క్ : వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో భర్తను అత్యంత కిరాతకంగా అంతమొందించిన భార్యకు, ఆమె ప్రియుడికి కర్ణాటకలోని భద్రావతి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. నమ్మిన భర్తను మత్తుమందు ఇచ్చి, ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపిన ఈ కేసును 'అరుదైన వాటిలో అరుదైనది'గా పరిగణించిన న్యాయమూర్తి ఇందిరా మైలస్వామి చెట్టియార్ నిందితులిద్దరికీ ఉరిశిక్ష ఖరారు చేశారు.
కేసు వివరాలు..
భద్రావతిలోని సురగినతోపి నివాసి ప్రకాశ్‌బాబు భార్య ఫ్లోరా న్యాన్సికి రాజశేఖరయ్య అనే వ్యక్తితో చాన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తన భర్తకు తెలిసిపోయిందనే అనుమానంతో, అతడిని అడ్డుతొలగించుకుంటేనే తమ బంధానికి స్వేచ్ఛ దొరుకుతుందని ఫ్లోరా పథకం పన్నింది. నిందితురాలు మొదట భర్తకు శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చింది. ప్రకాశ్‌బాబు స్పృహ కోల్పోగానే, అప్పటికే ఇంటి సమీపంలో మాటువేసి ఉన్న రాజశేఖరయ్య లోపలికి వచ్చి, ఫ్లోరాతో కలిసి అతడి గొంతు నులిమి హత్య చేశారు. మృతుని తల్లి ఫిర్యాదు ఆధారంగా భద్రావతి పేపర్‌టౌన్ పోలీసులు సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ వాదనలు, పోలీసుల ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం శనివారం తుది తీర్పు వెల్లడించింది.
నిందితులు ఫ్లోరా న్యాన్సి, రాజశేఖరయ్యలకు ఉరిశిక్ష విధించడమే కాకుండా.. రూ. 14 లక్షల భారీ జరిమానా కూడా విధించింది. ఈ జరిమానాలో రూ. 5 లక్షలను మృతుడి తల్లికి అందించాలని కోర్డు ఆదేశించింది. 2020 లో జరిగిన ఈ ఘటనలో ఇన్నేళ్ల తర్వాత వెలువడిన ఈ తీర్పుపై మృతుని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, న్యాయం గెలిచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ తీర్పు కన్నడనాట చర్చనీయాంశంగా మారింది.






