- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల భద్రతకే భంగం..!
ప్రజల కష్టార్జితాన్ని భద్రంగా కాపాడాల్సిన ప్రభుత్వ సంస్థలో ప్రజల నమ్మకానికి పునాది కదిలిపోయిందనే ఆరోపణలు కలకలం రేపుతోంది.

దిశ, కొత్తగూడ : ప్రజల కష్టార్జితాన్ని భద్రంగా కాపాడాల్సిన ప్రభుత్వ సంస్థలో ప్రజల నమ్మకానికి పునాది కదిలిపోయిందనే ఆరోపణలు కలకలం రేపుతోంది. భర్తను కోల్పోయి పసిబిడ్డతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ మహిళకు దాతలు అందించిన రూ.2 లక్షల సాయం పోస్టాఫీస్ ఖాతాలో కనిపించకపోవడంతో ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడకు చెందిన సందీప్ అనారోగ్యంతో మృతి చెందాడు. అతని భార్య రచన ఒంటరిగా మిగిలింది. వారి పరిస్థితిని చూసి చలించిన దాతలు పసిబిడ్డ భవిష్యత్తు కోసం సుమారు రూ.2 లక్షలు సేకరించి పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో జమ చేశారు.
ప్రభుత్వ పోస్టాఫీస్‌లో డబ్బు భద్రంగా ఉంటుందనే నమ్మకంతో కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని అక్కడే ఉంచారు. అయితే ఇటీవల ఖాతాను పరిశీలించగా అందులో నగదు లేకపోవడంతో రచన తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. తనకు తెలియకుండా అప్పటి బ్రాంచ్ మేనేజర్ రమేష్ 2025 డిసెంబరు 27న ఖాతా నుంచి మొత్తం ఉపసంహరించుకున్నారని ఆమె ఆరోపిస్తోంది. అనంతరం ఆయన బదిలీ పై వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. "భర్త చనిపోయాడు... నా బిడ్డకు తండ్రి లేడు... దాతలు నా పాప కోసం దాచిన సొమ్ము కూడా లేకపోతే నేను ఎవరిని ఆశ్రయించాలి ?" అంటూ రచన విలపిస్తోంది. ఆమె ఆవేదన స్థానికులను కలచివేస్తోంది.
రాజీ ప్రయత్నాలా..?
విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మాజీ బ్రాంచ్ మేనేజర్ తరఫున బంధువుల ద్వారా బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
నమ్మకం దెబ్బతింటే..?
ప్రజలు తమ జీవితకాల పొదుపులను అత్యంత భద్రంగా ఉంటాయని నమ్మి పోస్టాఫీస్‌లలో జమ చేస్తుంటారు. అలాంటి చోటే ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటన పై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని, ఆరోపణలు నిజమైతే బాధ్యుల పై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పసిబిడ్డ భవిష్యత్తు కోసం దాతలు అందించిన సొమ్ము బాధితురాలికి తిరిగి అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. భద్రత కోసం ప్రభుత్వాన్ని నమ్మిన ఓ నిరుపేద తల్లి.. ఇప్పుడు అదే ప్రభుత్వ వ్యవస్థను చూసి "నా బిడ్డ భవిష్యత్తు ఎక్కడ భద్రం ?" అని ప్రశ్నిస్తోంది.






