అరుదైన దృశ్యం.. అప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, ఈటల

by Prasad Jukanti |   (  Updated:2026-06-25 11:16:52  IST  )

తెలంగాణ రాజకీయాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. రాజకీయ వైరాన్ని మరిచి కేటీఆర్, ఈటల తమ పాత స్నేహాన్ని గుర్తుచేసుకుని అప్యాయంగా పలకరించుకున్నారు.

అరుదైన దృశ్యం.. అప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, ఈటల
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఒకే పార్టీలో ఉండి ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరస్పరం ఎదురుపడ్డారు. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కొడుకు పెళ్లిలో ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఒకే సమయంలో ఇద్దరు నేతలు ఎదురుపడటంతో పాత వైరాన్ని మరిచిపోయి పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ అక్కడే ఉన్న తన కుమారుడు హిమాన్షును పిలిచి ఈటలతో మాట్లాడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు స్పందిస్తూ రాజకీయాలు వేరు స్నేహం వేరు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

పొలిటికల్ స్పార్క్:

కేటీఆర్-ఈటల రాజేందర్ అపూర్వ కలయిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు కుదరబోతోందని ఇరు పార్టీల నేతల మధ్య సత్సంబంధాలు ఉన్నాయనడానికి కేటీఆర్, ఈటల కలయికే నిదర్శనం అని కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ కు బీఆర్ఎస్ మద్ధతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ పెళ్లికి బీజేపీ కాంగ్రెస్ మంత్రి పొన్నం కూడా హాజరయ్యారని, నిజానికి కాంగ్రెస్, బీజేపీ మధ్యనే సత్సంబంధాలు ఉన్నాయంటూ మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకే వేదికపై ఉన్న ఫోటోలను బీఆర్ఎస్ మద్దతుదారులు షేర్ చేస్తున్నారు. మొత్తంగా గతంలో ఒకే పార్టీలో కలిసి పని చేసిన కేటీఆర్, ఈటల ఇప్పుడు ప్రత్యర్థులుగా మారినప్పటికీ ఇలా పరస్పరం మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆహ్వానించదగిన విషయం అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో జరుగుతున్నట్లు వీరి మాట ముచ్చట రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా మార్పులకు కారణం అవుతుందా చూడాలి మరి.

Next Story