వెనెజువెలాలో భారీ భూకంపాలు.. 164కు చేరిన మరణాల సంఖ్య, 971 మందికి గాయాలు

by Ramesh Naini |

వెనెజువెలాలో బుధవారం సాయంత్రం సంభవించిన రెండు వరుస భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి.

వెనెజువెలాలో భారీ భూకంపాలు.. 164కు చేరిన మరణాల సంఖ్య, 971 మందికి గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Venezuela) వెనెజువెలాలో బుధవారం సాయంత్రం సంభవించిన రెండు వరుస భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 164 మంది ప్రాణాలు కోల్పోగా, 971 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ అధికారికంగా ప్రకటించారు. వందలాది భవనాలు కుప్పకూలడంతో, శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఒకే నిమిషంలో రెండు భూకంపాలు..

జాతీయ మీడియా ఇన్‌పుట్స్ ప్రకారం.. యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, కారకాస్‌కు పశ్చిమంగా ఉన్న మొరాన్ తీరప్రాంతంలో కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు కాగా... మరుసటి నిమిషంలోనే 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. వెనెజువెలా చరిత్రలో గత శతాబ్ద కాలంలో సంభవించిన అత్యంత బలమైన భూకంపాలలో ఇవి ఒకటిగా నిలిచాయి. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, దాదాపు 1,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతం, కొలంబియాల్లో కూడా ప్రకంపనలు రావడంతో అక్కడి భవనాలను ఖాళీ చేయించారు.

అత్యవసర పరిస్థితి విధింపు

భూకంప తీవ్రతకు దేశవ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లడంతో తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ దేశంలో అత్యవసర పరిస్థితిని (State of Emergency) ప్రకటించారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు వైద్యులంతా వెంటనే ఆసుపత్రుల్లో చేరాలని ఆదేశించారు. తీరప్రాంత రాష్ట్రమైన ‘లా గుఐరా’ ఈ భూకంపం ధాటికి పూర్తిగా అతలాకుతలమైంది. దీనిని రోడ్రిగ్జ్ ‘విపత్తు జోన్’గా ప్రకటించారు. ఇక్కడ డజన్ల కొద్దీ భవనాలు నేలమట్టమయ్యాయి.

ప్రజల సాయంతో రెస్క్యూ ఆపరేషన్

విపత్తు సహాయక సిబ్బందితో పాటు సాధారణ ప్రజలు సైతం పవర్‌ టూల్స్ సహాయంతో శిథిలాలను తొలగించి, ప్రాణాలతో ఉన్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నారు. లా గుఐరాలో శిథిలాల నుంచి ముగ్గురు పిల్లలను సజీవంగా బయటకు తీశారు. ఇక, భూకంపం ధాటికి రాజధాని కారకాస్‌లో విద్యుత్ సరఫరా, సెల్‌ఫోన్ సిగ్నళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. దేశంలోనే అతిపెద్దదైన సైమన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మెట్రో సేవలు నిలిచిపోగా, గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. పాఠశాలలను మూసివేసి, వాటిని పునరావాస కేంద్రాలుగా మార్చారు. ఈ క్లిష్ట సమయంలో వెనెజువెలాకు సహాయం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. అమెరికాతో పాటు కతార్, మెక్సికో, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్ దేశాలు కూడా ఇప్పటికే తమ రెస్క్యూ సిబ్బందిని, సహాయక సామగ్రిని వెనెజువెలాకు తరలించాయి.

Next Story