మద్యం మత్తులో స్కూల్ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్

by Taduka Kalyani |

పాఠశాల విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతూ, గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ ట్రైనింగ్ వద్ద మద్యం మత్తులో ఆటో నడుపుతున్న ఒక డ్రైవర్ ను ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మద్యం మత్తులో స్కూల్ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్
X

దిశ, కార్వాన్ : పాఠశాల విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతూ, గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ ట్రైనింగ్ వద్ద మద్యం మత్తులో ఆటో నడుపుతున్న ఒక డ్రైవర్ ను ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సమీపంలో బుధవారం ఉదయం ట్రాఫిక్ సబ్-ఇన్‌స్పెక్టర్ డి. జగదీష్, హోంగార్డులు కిరణ్ కుమార్, సురేష్‌లతో కలిసి స్కూల్ బస్సులు, ఆటోలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 8:37 గంటల సమయంలో అబిడ్స్‌లోని ‘స్లేట్ స్కూల్’కు చెందిన ఆరుగురు విద్యార్థులను టీ ఎస్ 12యూ ఎ 9230 ఆటోలో కూర్చోబెట్టుకొని డ్రైవర్ షేక్ ఇస్మాయిల్ (35) వెళ్తున్నాడు. డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు అతనికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్లు నిర్దారణ అయ్యింది. వెంటనే పోలీసులు డ్రైవర్ పై కేసు నమోదు చేసి లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. ఆటోలో ఉన్న విద్యార్థులను దింపి ప్రత్యామ్నాయ మార్గంలో స్కూల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాల పిల్లలను రవాణా చేసే వాహనాల డ్రైవర్లు రవాణా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని హైదరాబాద్ ట్రాఫిక్-2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెచ్చరించారు. విద్యార్థుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, నిబంధనలు ఉల్లంఘించి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Next Story