ప్రేమించిన యువతి హత్య.. యువకునికి జీవిత ఖైదు

by Batti.Sumithra |

ప్రేమించిన యువతి తనను పెళ్లి చేసుకోవాలని పదే పదే అడగడంతో ఆమెను హత్య చేసిన ప్రియునికి జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 1000 జరిమానా విధిస్తూ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ తీర్పును వెలువరించారు.

ప్రేమించిన యువతి హత్య.. యువకునికి జీవిత ఖైదు
X

దిశ, కరీంనగర్ లీగల్ : ప్రేమించిన యువతి తనను పెళ్లి చేసుకోవాలని పదే పదే అడగడంతో ఆమెను హత్య చేసిన ప్రియునికి జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 1000 జరిమానా విధిస్తూ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ తీర్పును వెలువరించారు. వివరాలు ప్రాసిక్యూషన్ కథనం మేరకు తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామానికి చెందిన బోయిని వరలక్ష్మి పోరండ్ల గ్రామానికి చెందిన ఆసోద అఖిల్ పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ వివాహం అఖిల్ ఇంట్లో పెద్దలకు తెలియడంతో వారు పెళ్ళికి నిరాకరించారు. దీంతో ప్రేమించిన వరలక్ష్మిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించిన అఖిల్ ఆమెను 2022 సంవత్సరం జనవరి 2వ తేదీన మధ్యాహ్నం సమయంలో ద్విచక్ర వాహనం పై ఎక్కించుకొని చెంజర్ల శివారులోని దేవుని గుట్టవద్దకు తీసుకెళ్లి కొద్ది సేపు ఏకాంతంగా గడిపిన అనంతరం వరలక్ష్మి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఆమె డ్రెస్ కు ఉన్న చున్నీతోనే ఆమె గొంతు నులిమి చంపేసి అనంతరం ఆమె మొబైల్ ఫోన్ ను పగలగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కాగా వరలక్ష్మి తల్లి పోచవ్వ, పెద్దమ్మ రాజమ్మ ఆమె గురించి బంధువుల ఇళ్లతో పాటు చుట్టుపక్కల వెతకినా ప్రయోజనం లేకపోవడంతో జనవరి 5, 2022 రోజున ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో పోరండ్లకు చెందిన అఖిల్ పై అనుమానం వ్యక్తం చేస్తూ వరలక్ష్మి పెద్దమ్మ రాజమ్మ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు అఖిల్ కదలికల పై నిఘా పట్టడంతో హత్య విషయం వెలుగు చూసింది. హత్య చేసిన అఖిల్ తో పాటు హత్య చేసేందుకు పురి గొల్పారానే కారణంతో అఖిల్ తండ్రి శ్రీనివాస్, తల్లి లక్ష్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్షులను ఎల్ఎండీ కోర్టు సీడీఓ శంకర్, సీఎంఎస్ ఏఎస్ఐ సత్తయ్య లు కోర్టులో ప్రవేశ పెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్యాల ప్రతాప్ సాక్షులను విచారించారు. కాగా ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి శివకుమార్ నిందితుడు అఖిల్ కు జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 1000 జరిమానా విధించారు. కాగా ఈ కేసులో అఖిల్ తల్లిదండ్రుల పాత్ర లేదని వారిపై నేరం రుజువు కాలేదని తీర్పులో పేర్కొన్నారు.

Next Story