ఎగ్జిక్యూటివ్ అధికారుల భారీ నిరసన

by Ratna Kumari |

బొగ్గు గనుల అధికారుల సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి జీఎం కార్యాలయం ముందు ఎగ్జిక్యూటివ్ అధికారులు గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఎగ్జిక్యూటివ్ అధికారుల భారీ నిరసన
X

దిశ, కొత్తగూడెం సింగరేణి: బొగ్గు గనుల అధికారుల సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి జీఎం కార్యాలయం ముందు ఎగ్జిక్యూటివ్ అధికారులు గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. అధికారుల శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని, అధికారుల గౌరవాన్ని కాపాడాలని, సింగరేణి భవిష్యత్తును బలోపేతం చేయాలని నినాదాలు చేశారు. సింగరేణిలో కోల్ ఇండియా తరహాలోనే పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలని, 2017 వేతన సవరణలో జరిగిన నష్టాన్ని సరిచేస్తూ పే అప్‌గ్రేడేషన్‌తో పాటు 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్‌పీ) పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పదోన్నతులు, బదిలీలు, పోస్టింగ్‌లలో పారదర్శక విధానాన్ని అమలు చేయాలని కోరారు. సింగరేణి భవిష్యత్తు కోసం ఎంతగానో కృషి చేస్తున్న అధికారుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వారు తీవ్రంగా విమర్శించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే సింగరేణి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు బ్లాక్‌లను కేటాయించాలని డిమాండ్ చేశారు.

Next Story