అయోధ్య రామమందిర విరాళాల గోల్‌మాల్: ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-25 17:15:23  IST  )

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వచ్చిన విరాళాల దుర్వినియోగం, నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో గురువారం సంచలన పరిణామం చోటు చేసుకుంది.

అయోధ్య రామమందిర విరాళాల గోల్‌మాల్: ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వచ్చిన విరాళాల దుర్వినియోగం, నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో గురువారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. ట్రస్ట్ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ఎనిమిది మంది వ్యక్తులతో పాటు మరికొందరు అపరిచితులపై అయోధ్య పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, మనీష్ యాదవ్, లవ్‌కుష్ మిశ్రా, కరుణేష్ పాండే, రమా శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లాలపై వంచన, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు, అలాగే ఈ వ్యవహారంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) కింద పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. గత జూన్ 19నే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కేసుపై స్పందిస్తూ.. సిట్ (SIT) విచారణ పూర్తయిందని, త్వరలోనే "నిజం గెలుస్తుందని" పేర్కొన్నారు. అలాగే దర్యాప్తు ముగిసేవరకు రాజకీయ పార్టీలు నిరాధారమైన వ్యాఖ్యలు చేయవద్దని ఆయన కోరారు.

మరోవైపు.. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ 'X' వేదికగా స్పందిస్తూ, ఇది బీజేపీ ప్రభుత్వంలో అన్యాయానికి పరాకాష్ట అని విమర్శించారు. "చిన్న చిన్న చేపలను బలిచ్చి, పెద్ద తిమింగలాలను రక్షించేందుకే ఈ నాటకం ఆడుతున్నారు. మొదట సిట్ పేరుతో కీలక ఆధారాలన్నింటినీ చెరిపేసి, ఎవరిని కాపాడాలో, ఎవరిని ఇరికించాలో ముందే స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని, ఆ తర్వాతే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు కంటే ముందే ఇక్కడ ముగింపు రాసేశారు" అని అఖిలేష్ ఆరోపించారు.

Next Story