- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది : టీపీసీసీ చీఫ్
నీట్ అక్రమాలపై ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మౌనం దారుణమని, రాజస్థాన్ కోటాలో రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ పిలుపు ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నీట్ అక్రమాలపై ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మౌనం దారుణమని, రాజస్థాన్ కోటాలో రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ పిలుపు ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులే నీట్ పేపర్ లీక్‌కు కారణమని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష పేపర్‌ను లీక్ చేశారని ఆయన ఆరోపించారు. గురువారం నారాయణగూడలో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఛాత్రోన్ కి గూంజ్ పేరిట విద్యార్థి ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు సామాజిక, విద్యా, సాంకేతిక, యువత అభివృద్ధి తదితర అంశాలపై తమ ఆలోచనలు, సూచనలు, వినూత్న ప్రతిపాదనలను ప్రజెంటేషన్ల రూపంలో వివరించారు.
విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకత, సమాజాభివృద్ధిపై వారి అవగాహనను ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు సాగాయి. నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు, పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, యువత భవిష్యత్తుకు సంబంధించిన అనేక అంశాలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ వల్ల 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని, తల్లిదండ్రుల కష్టాన్ని, విద్యార్థుల శ్రమను పేపర్ లీకులు వమ్ము చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకం దెబ్బతింటోందని, విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు.
యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని కఠినంగా శిక్షించాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడటం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని, దేశ యువత ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ డీసీసీ చీఫ్మోతా రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ యువతకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే వేదికలను కల్పించడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, విశ్లేషణాత్మక దృక్పథం మరియు సమాజ నిర్మాణంపై బాధ్యత మరింత పెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, ఛత్రోంకీ గూంజ్ కార్యక్రమం పోస్టర్ ను మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఆదివాసీ సెల్ చైర్మన్, విక్రాంత్ భురియా, ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ లు పాల్గొన్నారు,






