ఎస్ఐఆర్‌పై మౌనం.. రేవంత్‌పైనే విమర్శలు: కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ ఫైర్

by Ramesh Naini |

ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల కాంగ్రెస్ నేతలు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని, బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ పేరిట భారీ ఎత్తున ఓట్లను తొలగించారని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఎస్ఐఆర్‌పై మౌనం.. రేవంత్‌పైనే విమర్శలు: కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల కాంగ్రెస్ నేతలు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని, బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ పేరిట భారీ ఎత్తున ఓట్లను తొలగించారని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మ్యాపింగ్ లోకి రాని కోటి 2 లక్షల ఓట్లు, మొత్తం ఓట్లలో 33 శాతం ఓట్లు అంతు చిక్కడం లేదని ఎన్నికల సంఘం చెబుతుందని ఆయన అన్నారు. గురువారం ఢిల్లీలో చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, హరీశ్ రావులు ఎస్ఐఆర్ పై చర్చించకుండా వారి సమావేశాల్లో రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారని, ఎస్ఐఆర్ పై బీఆర్ఎస్ నేతలకు భయం లేదు, బీజేపీతో అండర్ స్టాండింగ్ లో ఉన్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యత ఉన్నందునే రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన గొప్ప పనులు ఏంటి? అని చామల నిలదీశారు.

హరీశ్ రావు, కేటీఆర్ వారి ప్రభుత్వంలో ఎన్ని అప్పులు చేశారో ప్రజలు మర్చిపోయారని, వారి హయాంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుంచి దాదాపు 11 శాతం వడ్డీ రేటుతో భారీగా అప్పులు చేశారని ఎంపీ చామల విమర్శించారు. ఎల్ అండ్ టీ సంస్థను కేసీఆర్ ఇబ్బందులకు గురి చేశారని, అందుకే హైదరాబాద్ మెట్రోను ఆ సంస్థ మెయింటైన్ చేయలేకపోయిందని ఆయన ఆరోపించారు. ఎల్ అండ్ టీ నష్టాలకు కేసీఆర్ ప్రభుత్వం కారణమని, అడ్డగోలుగా ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దండుకుందని ఎంపీ చామల ఆరోపణలు గుప్పించారు. కేటీఆర్ అపరిచితుడు అయ్యాడు, మైక్ పట్టుకుంటే ఏదో ఏదో మాట్లాడుతున్నారని, ఆయన ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి సోదరులపై మాట్లాడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

ఢిల్లీ సమావేశంలో ఎంపీ చామల

ఢిల్లీలో గురువారం జరిగిన పార్లమెంటరీ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ వ్యవహారాల స్థాయీ సంఘం సమావేశంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పై జరిగిన సమీక్షలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వేగవంతమైన పట్టణీకరణ, తెలంగాణలో పట్టణ జనాభా 50 శాతానికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అవసరమని ఎంపీ చామల పేర్కొన్నారు. దేశ పట్టణ జనాభాలో సుమారు 4 శాతం వాటా కలిగిన తెలంగాణకు ఈ పథకం కింద రూ.3,375 కోట్ల కేంద్ర సహాయం లభించే అవకాశం ఉందని, వినియోగించుకోవాలంటే రాష్ట్రం రూ.13,500 కోట్ల నుంచి రూ.16,000 కోట్ల విలువైన బ్యాంకబుల్ ప్రాజెక్టులను సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు.

మొదటి ఎన్ఏసీ సమావేశంలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాలకు సంబంధించిన రూ.5,681 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, అందులో రూ.1,420 కోట్ల కేంద్ర సహాయం మంజూరైందని ఎంపీ చామల ప్రస్తావించారు. అదనంగా టైర్-3 నగరాల కోసం రూ.7,800 కోట్ల ప్రాజెక్టు పైప్‌లైన్‌ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోందని ఆయన వెల్లడించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అమలులో ప్రధాన సవాలు స్థానిక సంస్థలకు అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులు, ప్రాజెక్టుల రూపకల్పన, తక్కువ వడ్డీ రేట్లకు రుణాల సమీకరణ వంటి అంశాలపై సరైన అవగాహన లేకపోవడమేనని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Next Story