ఒక్క ఓటు గల్లంతైనా భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది..

by Batti.Sumithra |

భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జూలై 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద బీఎల్ఎ లతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.

ఒక్క ఓటు గల్లంతైనా భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది..
X

దిశ, తిరుమలగిరి : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జూలై 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద బీఎల్ఎ లతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 2వ వార్డులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, మీ పేరు లిస్టులో ఉందో లేదో స్వయంగా చెక్ చేసుకోవాలని, ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని పిలుపునిచ్చారు.

ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటు గల్లంతు కావడంతో పాటు భవిష్యత్తులో వారి ఆధార్, రేషన్ కార్డులు, పాస్ పోర్టులు రద్దయి, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా అనర్హులవుతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. అందుకే కాంగ్రెస్ తరపున బీఎల్ఎలు నెల రోజుల పాటు ప్రతిఇంటికి వెల్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తారని, ఓటర్లందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా బీఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడుతూ అత్యంత అప్రమత్తంగా బాధ్యతగా పనిచేయాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా మిస్ కాకూడదని, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మనం చేస్తున్న సేవని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్ఐఆర్ కో ఆర్డినేటర్లు బద్రీనాథ్ యాదవ్, సంకి రవీందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story