వివాదాల ఐఏఎస్ అధికారి! వై. శ్రీలక్ష్మికి ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్

by Ramesh Naini |

సుదీర్ఘ కాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 1988 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.

వివాదాల ఐఏఎస్ అధికారి! వై. శ్రీలక్ష్మికి ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సుదీర్ఘ కాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 1988 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన (GPM & AR - పాలనా సంస్కరణల విభాగం) శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆమెను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ గురువారం జీవో జారీ చేశారు. ఇప్పటివరకు ఈ శాఖ అదనపు ఇన్‌చార్జిగా ఉన్న శంషేర్ సింగ్ రావత్ స్థానంలో శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, ఈ నెల 30న (మరో నాలుగు రోజుల్లో) శ్రీలక్ష్మి పదవీ విరమణ చేయనుండగా, రిటైర్మెంట్‌కు సరిగ్గా ముందే కూటమి ప్రభుత్వం ఆమెకు ఈ పోస్టింగ్ ఇవ్వడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే ఆకస్మిక నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలు లేవని, కేవలం మానవతా దృక్పథంతో ఆమెకు గౌరవప్రదమైన వీడ్కోలు పలికేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బ్యూరో క్రాటిక్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కేసుల నేపథ్యం.. రెండేళ్ల వెయిటింగ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ‘ఓబుళాపురం మైనింగ్’ కేటాయింపుల కేసులో శ్రీలక్ష్మి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ ఆమెను అరెస్ట్ చేయడంతో జైలు జీవితం కూడా గడిపారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన ఆమె, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ క్యాడర్‌లో పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయిన తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్‌కు బదిలీపై వచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే, 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు రెండేళ్ల పాటు ప్రభుత్వం ఆమెను ఎలాంటి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్‌లో ఉంచింది. కాగా, ఓఎంసీ కేసు నుంచి తన పేరును తొలగించాలని శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

Next Story