సచివాలయంలో ఎంజేపీ సొసైటీ 6వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

సచివాలయంలో ఎంజేపీ సొసైటీ 6వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఎంజేపీ సొసైటీ 6వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో.. విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల సంక్షేమంపై పలు కీలక తీర్మానాలను ఆమోదించారు.

నిర్ణయాలు ఇవే..

1.రాష్ట్రంలోని ఇతర సొసైటీల తరహాలోనే ఎంజేపీ సొసైటీ పేరును ఇకపై తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీగా మారుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

2. ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన ఎంజేపీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను బహుకరించాలని సమావేశంలో నిర్ణయించారు.

3.ఎంజేపీ గురుకులాల పరిధిలోని వ్యవసాయ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి, కేవలం ఎంజేపీ గురుకుల విద్యార్థులకు మాత్రమే ప్రత్యేక అవకాశం కల్పించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

4.విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు దురదృష్టవశాత్తు మరణించిన సందర్భాల్లో, వారి తల్లిదండ్రులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో నిర్ణయించారు.

5. గురుకుల పాఠశాలల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్లు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఆధునిక బోధన కోసం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ సరఫరా చేయాలని బోర్డు నిర్ణయించింది.

6. విద్యా పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు పదవీ విరమణ చేసిన ప్రిన్సిపాల్‌లను 'అకడమిక్ కన్సల్టెంట్లు'గా నియమించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీలో ప్రస్తుతమున్న 70:30 (పదోన్నతులు: ప్రత్యక్ష నియామకాలు) నిష్పత్తిని కొనసాగించాలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో నిర్ణయించారు.

విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం: పొన్నం

ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 'బీసీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పోటీ పరీక్షల్లో వారు రాణించేందుకు, జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు సంపాదించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయాలు గురుకులాల రూపురేఖలను మార్చి, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తాయి' అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాలమయాదేవి, ఎంజేపీ బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి సైదులు, బోర్డు సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story