నీట్ ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం

by Naga Rani Yarlagadda |

NTA జూన్ 21న నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - 2026 రీ-ఎగ్జామ్ కు సంబంధించిన ప్రాథమిక సమాధానాల కీ ని గురువారం విడుదల చేసింది.

నీట్ ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం
X
  • జూన్ 28 వరకు ఆన్‌లైన్‌లో ఛాలెంజ్ చేసేందుకు అవకాశం
  • ఫలితాల త్వరితగతిన విడుదలకు ఎన్‌టీఏ చర్యలు

దిశ, తెలంగాణ బ్యూరో : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జూన్ 21న నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) - 2026 రీ-ఎగ్జామినేషన్‌కు సంబంధించిన ప్రాథమిక సమాధానాల కీ (ప్రొవిజనల్ ఆన్సర్ కీ)ని గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలను https://nta.ac.in వెబ్‌సైట్‌లో, అలాగే ప్రాథమిక కీని https://neet.nta.nic.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎన్‌టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ పూర్తయిన తర్వాత కీని విడుదల చేస్తారు. అయితే ఈసారి పారదర్శకతను పెంచడంతో పాటు, ఫలితాలను వీలైనంత త్వరగా ప్రకటించాలనే లక్ష్యంతో OMR షీట్ల స్కానింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే సమాధానాల కీని ఎన్‌టీఏ విడుదల చేసింది. దీనివల్ల అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను నిపుణుల కమిటీ సమాంతరంగా పరిశీలిస్తుందని, తద్వారా తుది కీ, ఫలితాలను అత్యంత వేగంగా విడుదల చేయడానికి వీలవుతుందని స్పష్టం చేసింది.

ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు

అభ్యర్థులు గురువారం నుంచి జూన్ 28వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే తమ అభ్యంతరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈమెయిల్, ఫ్యాక్స్ లేదా పోస్ట్ ద్వారా పంపే దరఖాస్తులను అంగీకరించరు. ఛాలెంజ్ చేసే ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ అంగీకరిస్తే, ఆ ప్రశ్నకు సంబంధించిన ఫీజును పూర్తిగా రీఫండ్ (వెనక్కి) చేస్తారు. అభ్యర్థులు పరీక్ష రోజున తమకు వచ్చిన క్వశ్చన్ పేపర్ సిరీస్ కోడ్ ఆధారంగానే అభ్యంతరాలను రైజ్ చేయాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ ఏదైనా అభ్యంతరాన్ని అంగీకరిస్తే, ఆ సవరణ నాలుగు సెట్ల అభ్యర్థులందరికీ సమానంగా వర్తిస్తుంది. కాబట్టి వేర్వేరు సిరీస్ కోడ్‌ల కింద ఒకే ప్రశ్నకు విడివిడిగా అభ్యంతరాలు తెలపాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ నడుస్తోందని, ఈ దశలో వ్యక్తిగత స్కానింగ్ కాపీలు అందుబాటులో ఉండవని ఎన్‌టీఏ తెలిపింది. స్కానింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థులు తమ ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను చూసుకునేందుకు విడిగా అవకాశం కల్పిస్తామని పేర్కొంది. అభ్యంతరాల గడువు ముగిసిన తర్వాత నిపుణులు ఖరారు చేసిన కీని మాత్రమే తుది నిర్ణయంగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఉండదు.

Next Story