Apple: మ్యాక్‌లు, ఐప్యాడ్‌ల ధరలు పెంచిన యాపిల్

by S Gopi |   (  Updated:2026-06-25 16:13:37  IST  )

ప్రొడక్షన్ కాస్ట్ భారీగా పెరిగిపోవడంతో యాపిల్ తన మ్యాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌ల ధరలను గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత్‌లోనూ పెంచేసింది.

Apple: మ్యాక్‌లు, ఐప్యాడ్‌ల ధరలు పెంచిన యాపిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు నేరుగా వినియోగదారుల జేబుపై కూడా ప్రభావం చూపడం ప్రారంభించింది. మెమరీ చిప్‌లు, స్టోరేజ్ భాగాల కొరత కారణంగా ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరగడంతో గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన మ్యాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌ల ధరలను పెంచేసింది. ప్రొడక్షన్ కాస్ట్ భారీగా పెరిగిపోవడంతో యాపిల్ తన మ్యాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌ల ధరలను గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత్‌లోనూ పెంచేసింది. గ్లోబల్ మార్కెట్లో మ్యాక్‌బుక్ నియో బేస్ ప్రైస్ రూ. 599 నుంచి 699 డాలర్లకు పెంచింది. యాపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ కొత్త ధరలు ఇప్పటికే అప్‌డేట్ అయ్యాయి. కొన్ని ప్రీమియం మోడళ్లపై ఏకంగా రూ. 1 లక్ష వరకు అదనపు భారం పడటం గమనార్హం. యాపిల్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్‌లో ఈ ప్రభావం గట్టిగానే పడింది. రూ. 1,19,900 ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ అయిన ఎం5 చిప్ 13-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 30,000 పెరిగి రూ. 1,49,900కి చేరింది. అలాగే 15-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ వేరియంట్ ధర రూ. 35,000 పెరిగి రూ. 1,79,900 వద్ద లిస్ట్ అయింది. ఇకపోతే మొదటిసారి యాపిల్ ఎకోసిస్టమ్‌లోకి వచ్చే విద్యార్థుల కోసం బడ్జెట్ సెగ్మెంట్‌లో తెచ్చిన ‘మ్యాక్‌బుక్ నియో’ ధర కూడా రూ. 10,000 పెరిగింది. గతంలో రూ. 69,900 ఉన్న ఈ మోడల్ ఇప్పుడు రూ. 79,900 కి చేరింది.

ఐప్యాడ్‌లు కూడా ఖరీదే

'మ్యాక్‌బుక్ ప్రో' సిరీస్‌లో ఈ ధరల పెంపు మరీ దారుణంగా ఉంది. ఎం5 చిప్, 16జీబీ ర్యామ్‌తో వచ్చే బేస్ 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర ఏకంగా రూ. 70,000 పెరిగి ఇప్పుడు రూ. 2,39,900కి చేరింది. దేశంలో యాపిల్ ప్రొడక్ట్స్ చరిత్రలోనే ఇంత తక్కువ టైమ్‌లో ఇంత పెద్ద మొత్తంలో ధర పెరగడం ఇదే మొదటిసారి. ఇకపోతే టాప్-ఎండ్ మోడల్ అయిన మ్యాక్‌బుక్ ప్రో 14-అంగుళాల 'ఎం5 మ్యాక్శ్ వేరియంట్ ధర అయితే ఏకంగా రూ. 1,00,000 పెరిగి కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇచ్చింది. కేవలం ల్యాప్‌టాప్‌లే కాదు, ఐప్యాడ్స్ ధరలను కూడా యాపిల్ భారీగా సవరించింది. ఎం4 ప్రాసెసర్‌తో వచ్చే 11-అంగుళాల ఐప్యాడ్ ఎయిర్ గతంలో రూ. 64,900 ఉండగా, ఇప్పుడు రూ. 25,000 పెరిగి రూ. 89,900 మార్కును తాకింది. అలాగే ప్రీమియం ట్యాబ్ అయిన ఎం5 ఐప్యాడ్ ప్రో గతేడాది రూ. 99,990 కి లాంచ్ కాగా, ఇప్పుడు రూ. 39,910 పెరిగి ఏకంగా రూ. 1,39,900 కి చేరింది. మొత్తానికి గ్లోబల్ చిప్ కొరత, పెరిగిన మెమరీ ధరలు యాపిల్ డివైజ్‌లను మరింత లగ్జరీగా మార్చేశాయి.

ఈ సెమీకండక్టర్ల కొరత కేవలం ధరల పెంపుతోనే ఆగడం లేదు. భారతీయ మార్కెట్లో కొన్ని టాప్-ఎండ్ మ్యాక్ మోడళ్ల సప్లై, డెలివరీ షెడ్యూల్స్ కూడా మారనున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినా చేతికి రావడానికి మునుపటికంటే ఎక్కువ టైమ్ పట్టేలా ఉంది. ఈ సప్లై చైన్ సమస్యలు మరికొన్ని నెలల పాటు ఇలాగే కొనసాగుతాయని యాపిల్ ఇప్పటికే పేర్కొంది.

Next Story