బంగ్లాదేశ్‌లో భారత్‌ హైకమిషనర్‌ కు క్యాబినెట్ హోదా.. ఉత్తర్వులు జారీ

by Naga Rani Yarlagadda |

బంగ్లాదేశ్ లో భారత హై కమిషనర్ కు కేంద్రం క్యాబినెట్ మంత్రి హోదా కల్పించింది.

బంగ్లాదేశ్‌లో భారత్‌ హైకమిషనర్‌ కు క్యాబినెట్ హోదా.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ లో భారత కొత్త హైకమిషనర్ గా నియమితులైన సీనియర్ రాజకీయ నేత దినేష్ త్రివేదికి కేంద్రప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. అధికారిక ప్రొటోకాల్ ప్రకారం.. ఆయనకు కేంద్ర క్యాబినెట్ మంత్రితో సమానమైనహోదాను కల్పిస్తూ.. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం దినేష్ త్రివేది వ్యక్తిగత గౌరవార్థం, అధికారిక కార్యక్రమాల కోసమే ఈ హోదాను కేటాయిస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

దౌత్య బాధ్యతల్లో సరికొత్త అధ్యాయం

బీజేపీ నేత అయిన దినేష్ త్రివేది.. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ కు తన దౌత్య పత్రాలను సమర్పించి అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో కేంద్రం ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించడం గమనార్హం. ఒక పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు బంగ్లాదేశ్ లో భారత రాయబారిగా నియమితుడవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఏప్రిల్ 27న ఆయనను కేంద్రం ఈ పదవికోసం ఎంపిక చేసింది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. త్రివేది ఢాకాలోని ఇండియన్ వీసా సెంటర్ ను సందర్శించి కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ పౌరుల కోసం ఆపేసి జనరల్ ట్రావెల్ వీసాల ప్రక్రియను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 28 నుంచి వీసా అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఇరుదేశాల మధ్య బలహీనపడిన సత్సంబంధాలు మళ్లీ పుంజుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story