కూకట్​పల్లికి క్లాస్​.. మూసాపేట్​కు మాస్​

by Batti.Sumithra |

జీహెచ్​ఎంసీలో భాగంగా ఉన్నప్పుడు ఆ సర్కిల్​లో పోస్టింగ్​ అంటే చాలు ముఖ్యమంత్రుల నుంచి స్థానిక ఎమ్మెల్యేల వరకు ఉన్న రాజకీయ పలుకుబడిని వినియోగించుకుని బదిలి చేయించుకుని సీటు దక్కించుకునే వారు అధికారులు.

కూకట్​పల్లికి క్లాస్​.. మూసాపేట్​కు మాస్​
X

దిశ, కూకట్​పల్లి : జీహెచ్​ఎంసీలో భాగంగా ఉన్నప్పుడు ఆ సర్కిల్​లో పోస్టింగ్​ అంటే చాలు ముఖ్యమంత్రుల నుంచి స్థానిక ఎమ్మెల్యేల వరకు ఉన్న రాజకీయ పలుకుబడిని వినియోగించుకుని బదిలి చేయించుకుని సీటు దక్కించుకునే వారు అధికారులు. జీహెచ్​ఎంసీ విభజన తర్వాత ఒక్కసారిగా ఆ సర్కిల్​కు ఉన్న క్రేజ్​ తగ్గింది. ఆ సర్కిల్​లో పోస్టింగ్​ అంటేనే అధికారులు విముఖత చూపించడం, ఉన్నతాధికారులు బదిలి చేసిన ఏదో సాకుతో సెలవు పెట్టి వెళుతున్నారు. గ్రేటర్​ హైదరాబాద్​ కమిషనరేట్​ అంతర్భాగంలో ఒక వెలుగు వెలిగిన సర్కిల్​ మూసాపేట్​, మిని ఇండియాగా, ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా పేరుగాంచిన కేపీహెచ్​బీ కాలనీ, బాలాజీనగర్​, మూసాపేట్ గ్రామం, అల్లాపూర్​, గాయత్రి నగర్, మోతీ నగర్​​ ప్రాంతాలతో కూడి ఉండేది.

జీహెచ్​ఎంసీని మూడు కార్పొరేషన్​లుగా విభజించిన ప్రభుత్వం కొత్తగా సైబరాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్​ను ఏర్పాటు చేసింది. అదే విధంగా కూకట్​పల్లి జోన్​లోని సర్కిళ్లను పునర్​ విభజించారు. ఈ క్రమంలో మూసాపేట్​ గ్రామం పరిధిని మూసాపేట్​ సర్కిల్​గా, కూకట్​పల్లి గ్రామం పరిధిలోని ప్రాంతాన్ని కూకట్​పల్లి సర్కిల్​గా ఏర్పాటు చేశారు. దానికి తోడు శేరిలింగంపల్లిలోని మాధాపూర్​ను, ఆల్విన్​ కాలనీ సర్కిళ్లను కూకట్​పల్లి జోన్​లో కలిపారు. ఇదిలా ఉండగా మూసాపేట్​ సర్కిల్​లో గతంలో ఉన్న కేపీహెచ్​బీ కాలనీ, బాలాజీనగర్​, వసంత్​నగర్​, జేఎన్​టీయూ, సర్దార్​ పటేల్​ నగర్​, ఎన్​ఆర్​ఎస్​ఏ కాలనీ, సీబీసీఐడీ కాలనీ ఇలా ధనవంతులు నివాసం ఉండే గేటెడ్​ కమ్యునిటీలు, పెద్ద కాలనీలు మూసాపేట్​ సర్కిల్​ నుంచి తొలగించి కూకట్​పల్లి సర్కిల్​గా చేశారు.

మూసాపేట్​ సర్కిల్​లో వార్డులు..

1. మూసాపేట్​.

2. మోతీనగర్.

3. బాలానగర్.

4. ప్రశాంత్​నగర్.,

5. అల్లాపూర్​.

కూకట్ పల్లి సర్కిల్ పరిధిలో వార్డులు..

1. కూకట్​పల్లి.

2. కేపీహెచ్​బీ కాలనీ.

3. వసంత్​నగర్.

4. కైత్లాపూర్

5. బాలాజీ నగర్

6. గాయత్రి నగర్.

కాసులు లేని సర్కిల్​లో పని చేయలేమంటున్న అధికారులు..

మూసాపేట్​ సర్కల్​ పూర్తిగా స్లమ్​ ప్రాంతంతో కూడి ఉంది. పెద్దగా రెవెన్యూ లేని ప్రాంతాలను, కనీసం ఆస్తి పన్ను కూడా వసూలు కానీ ప్రాంతాలతో ఉండటంతో అధికారులు మూసాపేట్​ సర్కిల్​లో పని చేయడానికి సుముఖత చూపడం లేదు. డిసెంబర్​లో సీఎంసీ ఏర్పడిన నాటి నుంచి ఆరు నెలల కాలంలో ఇప్పటికి నలుగురు డీసీలు బదిలీ అయ్యారు. ఇప్పుడు తాజాగా 4వ డీసీ బాధ్యతలు చెపడుతున్నారు. ఇద్దరు పక్క సర్కిల్​లో ఖాళీ అవడంతో బదిలి చేయించుకోగా ఒకరు మాత్రం నెల రోజుల లోపే బదిలీ చేయించుకుని సొంత ఊరికి వెళ్లినట్టు సమాచారం. అంతే కాకుండా మూసాపేట్​ సర్కిల్​లోని ఇంజనీరింగ్​, ఎంటమాలజీ, ఎన్ఫోర్స్​మెంట్, పారిశుధ్య విభాగం, టౌన్​ప్లానింగ్​, రెవెన్యూ ఇలా వివిధ శాఖల అధికారులు వేరే సర్కిళ్లకు బదిలి చేయించు కోవడానికి పైరవీలు చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది.

మూసాపేట్​, కూకట్​పల్లి సర్కిళ్ల మార్పు తప్పదా..?

గతంలో ఉన్న విధంగా మూసాపేట్​, కూకట్​పల్లి సర్కిళ్ల పరిధిని కొంత స్లమ్​, కొంత క్లాస్​ కాలనీలను కలుపుతూ సర్కిల్​లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్​ పెరుగుతుంది. పూర్తిగా స్లమ్​ ప్రాంతంతో మూసాపేట్​, క్లాస్​ కాలనీలతో కూకట్​పల్లి సర్కిల్​ ఏర్పాటుతో అధికారులు, సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయం పై సీఎంసీ అధికారులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.

Next Story