వైభవ్ అరంగేట్రం ఖాయమేనా?.. వారిలో ఒక్కరిపై వేటు పడుతుందా?

by Harish |

భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య శుక్రవారం తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

వైభవ్ అరంగేట్రం ఖాయమేనా?.. వారిలో ఒక్కరిపై వేటు పడుతుందా?
X

దిశ, స్పోర్ట్స్ : మొన్నటివరకు అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌లో పాల్గొన్న భారత జట్టు ఇప్పుడు టీ20లు ఆడబోతోంది. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ నేటి నుంచే ప్రారంభంకానుంది. శుక్రవారం తొలి మ్యాచ్ జరగనుంది. పసికూన ఐర్లాండ్‌పై భారత్ విజయం నల్లేరు మీద నడకే. కానీ, ప్రత్యర్థిని తేలికగా తీసుకోకుండా భారత జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శన చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ ముగియగానే ఇండియా ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఆ టూరుకు ముందు ఈ చిన్న సిరీస్‌ సన్నాహకంగా ఉపయోగపడనుంది.

టీమిండియా సారథిగా శ్రేయస్ తొలి సిరీస్

ఇటీవల బీసీసీఐ భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించిన విషయం తెలిసిందే. భారత జట్టు సారథిగా అతనికి ఇదే తొలి సిరీస్. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. అతని సారథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లను కూడా ఫైనల్‌కు చేర్చాడు. భారత సారథిగా కూడా తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. అయితే, అతను టీ20 మ్యాచ్‌లు ఆడి చాలా రోజులైంది. 2023‌ డిసెంబర్‌లో చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. ఇటీవల అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌లోనూ అతను విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

అందరి దృష్టి వైభవ్‌పైనే

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి ఉంది. ఐపీఎల్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన అతన్ని టీమిండియా జెర్సీలో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. నేటి మ్యాచ్‌లో అతను అరంగేట్రం చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. కానీ, తుది జట్టులో పోటీ తీవ్రత దృష్ట్యా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ అతనికి తుది జట్టులో చాన్స్ దక్కితే ఓపెనర్‌గానే రావాలి. అతనికి అవకాశం ఇవ్వాలంటే అభిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్‌లలో ఒకరిపై వేటు వేయక తప్పదు. టీ20ల్లో నం.1 బ్యాటర్ అభిషేక్. మరోవైపు, సంజూ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి, వారిని పక్కనపెట్టడం అంత సులభం కాదు. శాంసన్‌ మిడిలార్డర్ కూడా బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి అతన్ని మిడిలార్డర్‌లో పంపిస్తే అభిషేక్, వైభవ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించొచ్చు. ఇద్దరూ దూకుడుగా ఆడే శైలి ఉన్న ప్లేయర్లే కావడంతో వారిద్దరూ రెచ్చిపోతే పరుగుల వరద ఖాయమే.

అన్నింటా భారతే గెలుపు

ఇప్పటివరకు ఐర్లాండ్‌తో భారత్ 8 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అన్ని మ్యాచ్‌ల్లో భారత్‌దే విజయం. చివరిసారిగా 2024 టీ20 వరల్డ్ కప్‌లో ఎదురుపడగా.. ఇండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

గంట ముందుగానే మ్యాచ్‌లు

షెడ్యూల్ ప్రకారం.. రెండు టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభంకావాల్సి ఉంది. అయితే, ఐర్లాండ్ క్రికెట్ బోర్డు(సీఐ) మ్యాచ్‌ను గంట ముందుగానే ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెల 28న రెండో టీ20 జరగనుంది. అదే రోజు మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఐర్లాండ్ రెండు టీ20లను సాయంత్రం 6 గంటలకే ప్రారంభించనుంది.

Next Story