ఎలక్ట్రిక్ బస్సు ఢీకొని మహిళ మృతి

by Taduka Kalyani |

లక్షెట్టిపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రవేశద్వారం వద్ద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది.

ఎలక్ట్రిక్ బస్సు ఢీకొని మహిళ మృతి
X

దిశ, లక్షెట్టిపేట: లక్షెట్టిపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రవేశద్వారం వద్ద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరావుపేట గ్రామానికి చెందిన ఎలుగం దేవక్క (63) బ్యాంకు పనుల నిమిత్తం తన కుమార్తె, అల్లుడితో కలిసి లక్షెట్టిపేటకు వచ్చింది. బ్యాంకు పని ముగిసిన అనంతరం కుమార్తె, అల్లుడు ఆమెను బస్టాండ్ వద్ద దించి వెళ్లిపోయారు. ఈ క్రమంలో దేవక్క నడుచుకుంటూ బస్టాండ్ ప్రవేశద్వారం దాటుతుండగా, బస్టాండ్‌లోకి వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమె కాలు నుజ్జునుజ్జవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆమెను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ దేవక్క మృతి చెందింది. మృతురాలి కుమార్తె ఆడెపు లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.

Next Story