ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయి.. తన కొత్త పుస్తకంలో మెలోని ఆసక్తికర విషయాలు

by Ramesh Naini |

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని తన తాజా పుస్తకం ‘జార్జియాస్ విజన్’ లో 2023 నాటి తన భారత పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయి.. తన కొత్త పుస్తకంలో మెలోని ఆసక్తికర విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని తన తాజా పుస్తకం ‘జార్జియాస్ విజన్’ (Giorgia's Vision) లో 2023 నాటి తన భారత పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జర్నలిస్ట్ అలెశాండ్రో సల్లుస్తితో ఆమె జరిపిన సంభాషణల ఆధారంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు.

ఢిల్లీ పర్యటనపై సరదా వ్యాఖ్యలు..

జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. 2023 మార్చిలో ‘రైసినా డైలాగ్’ కోసం ఆమె భారత్‌కు వచ్చినప్పుడు ఢిల్లీ వీధుల పొడవునా తన ముఖచిత్రంతో కూడిన ‘స్వాగతం’ పోస్టర్లు దర్శనమిచ్చాయని మెలోని గుర్తుచేసుకున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు అదే చిత్రంతో ‘ధన్యవాదాలు’ పోస్టర్లు కనిపించాయన్నారు. ‘ఈ పోస్టర్ల హడావుడి చూసి నాతో ఉన్న ఇటలీ ఉప ప్రధాని అంటోనియో తజాని సరదాగా.. ‘మీరు గనుక ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే పది లక్షల ఓట్లు సాధించి గెలుస్తారు’ అని వ్యాఖ్యానించారు అని మెలోని పుస్తకంలో పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆమెకున్న మంచి సాన్నిహిత్యం, సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘మెలోడి’ (Melodi) ట్రెండ్ గురించి కూడా ఇందులో ప్రస్తావన ఉంది. అంతర్జాతీయ దౌత్యంలో కేవలం అధికారిక నియమ నిబంధనలే కాకుండా, వ్యక్తిగత అనుబంధాలు, సరదా సంభాషణలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇతర ప్రపంచ నేతలతో ఆత్మీయ అనుభవాలు..

కేవలం భారత్‌తోనే కాకుండా, ఇతర దేశాల అధినేతలతో ఏర్పడిన వ్యక్తిగత బంధాలను కూడా ఆమె ఈ పుస్తకంలో వివరించారు. ట్యునీషియా అధ్యక్షుడితో సుదీర్ఘ చర్చల అనంతరం ఇద్దరూ కలిసి సరదాగా సిగరెట్ తాగడం వారి మధ్య దౌత్య బంధాన్ని మరింత బలపరిచింది. పోలాండ్ మాజీ ప్రధాని, మెలోనికి ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ పుస్తకాలంటే ఉన్న ఇష్టాన్ని గుర్తుపెట్టుకుని, వార్సాలోని ఒక థీమ్ కేఫ్‌కు తీసుకెళ్లి ఆమెను ఆశ్చర్యపరిచారు. జపాన్ మాజీ ప్రధాని కిషిదా.. మెలోని కుమార్తె గినెవ్రా కోసం ఒక పెద్ద ‘హెల్లో కిట్టీ’ బొమ్మను కానుకగా ఇచ్చారు.

పుస్తకం వివరాలు..

రాజకీయ జ్ఞాపకాలతో పాటు నాయకత్వం, జాతీయ గుర్తింపు, కుటుంబం, విశ్వాసం వంటి అంశాల చుట్టూ ఈ పుస్తకం సాగుతుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ (J.D. Vance) దీనికి పీఠిక రాశారు. కాగా, రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం ధర రూ. 695 గా ఉంది. ఇది ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది.

Next Story