జనన, మరణ ధ్రువపత్రాల కోసం ప్రజల పడిగాపులు

by Batti.Sumithra |

రామగుండం నగరపాలక సంస్థలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది.

జనన, మరణ ధ్రువపత్రాల కోసం ప్రజల పడిగాపులు
X

దిశ, గోదావరిఖని : రామగుండం నగరపాలక సంస్థలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. అత్యవసర అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి, నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరణ ధ్రువపత్రాలు సమయానికి అందక వారసత్వ ప్రక్రియలు, బ్యాంకు పనులు, బీమా క్లెయిమ్‌లు, ప్రభుత్వ పథకాల దరఖాస్తులు వంటి అనేక ముఖ్యమైన పనులు నిలిచిపోతున్నాయని బాధితులు చెబుతున్నారు. ఒక సాధారణ ధ్రువపత్రం కోసం పలుమార్లు కార్పొరేషన్ కార్యాలయానికి రావాల్సి వస్తోందని, దీనివల్ల సమయం, డబ్బు వృథా అవుతున్నాయని వాపోతున్నారు.

జనన ధ్రువపత్రాల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉందని, చిన్నపిల్లల పాఠశాల ప్రవేశాలు, ఇతర అధికారిక అవసరాలకు సర్టిఫికెట్లు అవసరమైన సమయంలో ఆలస్యం కారణంగా తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించాల్సిన నగరపాలక సంస్థలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం కార్పొరేషన్‌కు ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సేవల వేగం పెరగడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత అధికారులు జనన, మరణ ధ్రువపత్రాల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, నిర్ణీత సమయంలో సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆన్‌లైన్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించి, దరఖాస్తుదారులకు సమాచారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన ప్రాథమిక పౌర సేవల్లో ఆలస్యం లేకుండా పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారుల పై ఉందని ప్రజలు, నాయకులు గుర్తు చేస్తున్నారు.

Next Story