"నానో"పై నిర్లక్ష్యమేలా..?

by Ratna Kumari |

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న నానో యూరియా, నానో డీఏపీ ఎరువులపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో వ్యవసాయశాఖ అధికారులు విఫలమవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నానోపై నిర్లక్ష్యమేలా..?
X

దిశ, కామారెడ్డి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న నానో యూరియా, నానో డీఏపీ ఎరువులపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో వ్యవసాయశాఖ అధికారులు విఫలమవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో పాటు దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రచారం లేకపోవడంతో రైతులు ఇప్పటికీ సంప్రదాయ ఎరువులనే వినియోగిస్తున్నారని పేర్కొంటున్నారు.

ధర తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ..

సాధారణ యూరియా బస్తా ధర రూ.266 కాగా, 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ ధర కేవలం రూ.225 మాత్రమే. ఒక బాటిల్ ఒక ఎకరానికి సరిపోతుందని, రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా నేల సారాన్ని కాపాడటంలోనూ నానో ఎరువులు ఉపయోగపడతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. నానో ఎరువుల వినియోగంతో దిగుబడి 8 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

క్షేత్రస్థాయిలో ప్రచారం కరువు..

మండల స్థాయిలో క్లస్టర్ సమావేశాలు, ప్రదర్శన క్షేత్రాలు, రైతు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో నానో ఎరువులపై రైతులకు సరైన అవగాహన ఏర్పడడం లేదని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పించకుండా, కేవలం యాప్‌ల గురించి మాత్రమే చెబుతూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని రైతులు విమర్శిస్తున్నారు.

రైతులకు తగ్గే ఖర్చు..

నానో యూరియా వినియోగంతో యూరియా బస్తాల అవసరం తగ్గి, సాగు ఖర్చులు తగ్గుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన ఈ సాంకేతికతను సమర్థంగా వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రైతుల ప్రధాన డిమాండ్లు..

ప్రతి గ్రామంలో నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యక్షంగా వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ సహాయకుల ద్వారా ఇంటింటికీ ప్రచారం చేపట్టడంతో పాటు అన్ని ఎరువుల దుకాణాలు, అగ్రోస్ సేవా కేంద్రాల్లో నానో యూరియాను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తున్న సాంకేతికత క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు చేరకుండా పోతోందని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story