చుక్క నీటి కోసం ప్రజల ఎదురుచూపులు.. చంపాపేట్‌లో వేల లీటర్ల తాగునీరు రోడ్డుపాలు!

by Jakkula.Mamatha |

చంపాపేట్ ప్రధాన రహదారిలో గాంధీ విగ్రహం నుంచి చౌరస్తా వరకు ఉన్న ప్రాంతంలో హైదరాబాద్ వాటర్ వర్క్స్‌కు చెందిన పైప్‌లైన్ కనెక్షన్ దెబ్బతినడంతో గత కొన్ని రోజులుగా విలువైన తాగునీరు నిరంతరం వృథాగా పారుతోంది.

చుక్క నీటి కోసం ప్రజల ఎదురుచూపులు.. చంపాపేట్‌లో వేల లీటర్ల తాగునీరు రోడ్డుపాలు!
X

దిశ,చంపాపేట్: చంపాపేట్ ప్రధాన రహదారిలో గాంధీ విగ్రహం నుంచి చౌరస్తా వరకు ఉన్న ప్రాంతంలో హైదరాబాద్ వాటర్ వర్క్స్‌కు చెందిన పైప్‌లైన్ కనెక్షన్ దెబ్బతినడంతో గత కొన్ని రోజులుగా విలువైన తాగునీరు నిరంతరం వృథాగా పారుతోంది. ఈ లీకేజీ కారణంగా రహదారిపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారిపై పలు విద్యాసంస్థలు ఉండటంతో ప్రతి రోజూ వందలాది మంది విద్యార్థులు ఈ నీటిలోనే నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాల రాకపోకలతో నీరు చిమ్మి పాదచారులు ఇబ్బందులు పడుతుండగా, రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు అవకాశం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు నగరంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు వేల లీటర్ల మంచినీళ్లు ఇలా వృథాగా పారిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. సమస్యను గుర్తించిన వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ వాటర్ వర్క్స్ అధికారులు వెంటనే స్పందించి లీకేజీని శాశ్వతంగా నివారించి, నీటి వృథాను అరికట్టడంతో పాటు ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని ఎల్బీనగర్‌కు చెందిన సామాజిక ఉద్యమకారులు రాము, లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.

Next Story