- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టణాలను ముంచెత్తిన భారీ వర్షాలు.. చెరువులను తలపిస్తున్న రోడ్లు
ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఉదయం నుంచీ కురుస్తున్న వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఉదయం నుంచీ కురుస్తున్న వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్ర తీరప్రాంతం నుంచి మహారాష్ట్ర వరకూ విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రధాన రోడ్లు నీటమునిగాయి. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం, పామర్రు టౌన్లలో ఉదయం నుంచీ కురుస్తున్న వర్షంతో పల్లపుప్రాంతాలతో పాటు ప్రధాన రోడ్లు కూడా నీటమునిగాయి. మోకాలిలోతు వర్షపునీటిలోనే ప్రజలు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్ జలదిగ్బంధమవ్వగా.. కోనేరుసెంటర్ చెరువును తలపిస్తోంది. మున్సిపల్ సిబ్బంది వర్షపునీటిని తొలగించడంలో నిమగ్నమయ్యారు. మరోవైపు విశాఖ నగరం, జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగుల సమీపంలోనే కాక.. స్విమ్మింగ్ పూల్స్, చెరువులు, వాటర్ ఫౌంటెయిన్ల వద్ద కూడా ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. పిడుగులు పడే సూచనలు ఉండటంతో వ్యవసాయ కూలీలు, రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.






