శుభకార్యాల్లో మిగిలిన ఆహారాన్ని పరిశీలించాకే భుజించాలి: కలెక్టర్

by Kodari Anjali |

పరిశుభ్రతను తప్పనిసరిగా పరిశీలించాకే శుభకార్యాల్లో భుజించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రజలకు సూచించారు.

శుభకార్యాల్లో మిగిలిన ఆహారాన్ని పరిశీలించాకే భుజించాలి: కలెక్టర్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: శుభకార్యాలు పెళ్ళిళ్లు, విందు కార్యక్రమాలు, సామూహిక భోజనాల అనంతరం మిగిలిపోయిన ఆహారాన్ని స్వీకరించే ముందు దాని నాణ్యత, తాజాదనం, పరిశుభ్రతను తప్పనిసరిగా పరిశీలించాకే భుజించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రజలకు సూచించారు. ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మిగిలిన ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. పెళ్లిళ్లు, వేడుకలు, ఇతర కార్యక్రమాల అనంతరం మిగిలిన ఆహారాన్ని కొందరు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, సేవా సంస్థలు అవసరమైన వారికి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో, ఆహారం సురక్షితంగా ఉందో లేదో నిర్ధారించుకోవడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ తెలిపారు.

నాణ్యతలో ఏవైనా మార్పులు కనిపిస్తే...

ఆహారం తయారైన సమయం, నిల్వ చేసిన విధానం, పరిశుభ్రత ప్రమాణాలు, రవాణా పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించాలని, ఎక్కువసేపు గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచిన ఆహారం త్వరగా కలుషితమై ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఇలాంటి ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సేవా కార్యక్రమాల పేరుతో పంపిణీ చేసే ఆహారం తప్పనిసరిగా పరిశుభ్రమైన పాత్రలో నిల్వ చేసి, ఆహారం రంగు, రుచి, వాసన, లేదా నాణ్యతలో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే దానిని వినియోగించకుండా పారవేయాలని, ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్న జిల్లా కలెక్టర్, ప్రతి ఒక్కరూ ఆహార భద్రతా నిబంధనలు పాటించి సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్నే వినియోగించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Next Story