- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్ భరత్ చంద్ర పాఠశాలలో ఆందోళన
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్ ప్రాంతంలో, మున్సిపల్ 6వ వార్డు పరిధిలోని భరత్ చంద్ర పాఠశాల వద్ద శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్ ప్రాంతంలో, మున్సిపల్ 6వ వార్డు పరిధిలోని భరత్ చంద్ర పాఠశాల వద్ద శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఆర్మూర్ పోలీసులు హుటాహుటిన భారీ సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. పాఠశాలలో జరుగుతున్న బోధన పై విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. కోటార్మూర్‌లోని భరత్ చంద్ర పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉర్దూ భాష బోధించడం పై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పాఠశాల యాజమాన్యం వ్యవహరిస్తోందని, ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉర్దూ పాటలు నేర్పడంతో పాటు కల్మా (నమాజ్) చెప్పిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. భరత్ చంద్ర పాఠశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న అమీర్ ఖాన్ పర్యవేక్షణలో ఉపాధ్యాయురాలు ఆలీమా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఉర్దూ పాటలు నేర్పుతున్నట్లు బీజేపీ నాయకులు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ, ఎంఈఓ పింజ రాజ గంగారం, పెర్కిట్ పాఠశాల కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీనివాస్, ఆర్మూర్ రెవెన్యూ ఆర్‌ఐ ప్రమోద్, ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్, రూరల్ సీఐ జాన్ రెడ్డి, పలువురు ఎస్‌ఐలు పాఠశాలకు చేరుకుని విద్యార్థులను ప్రశ్నించారు. అలాగే విద్యార్థుల నోటుబుక్కులను పరిశీలించి ఉర్దూ బోధన పై విచారణ చేపట్టారు. పాఠశాలలో ఉర్దూ బోధించడం పై విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు యాజమాన్యాన్ని నిలదీశారు. హిందూ కుటుంబాల పిల్లలకు ఉర్దూ పాఠాలు బోధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల ప్రిన్సిపల్ అమీర్ ఖాన్‌తో వాగ్వివాదానికి దిగారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు తల్లిదండ్రులు, బీజేపీ నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఉర్దూ పాటలు నేర్పిన భరత్ చంద్ర పాఠశాలను సీజ్ చేసి, విద్యార్థులకు ఉర్దూ పాఠాలు, నమాజ్ నేర్పిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హిందూ పిల్లలకు నమాజ్, ఉర్దూ బోధించడం ఎందుకని ప్రశ్నించిన వారు, అదే విధంగా మైనారిటీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు కూడా బోధిస్తారా అని అధికారులను నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ పిల్లలకు ఉర్దూ పాఠాలు బోధించాలని ఏమైనా జీవో జారీ చేసిందా అని ప్రశ్నించారు.
అధికారులు విద్యార్థులను ప్రశ్నించిన సమయంలో వారు అనర్గళంగా ఉర్దూ మాట్లాడడం, వారి నోటుబుక్కుల్లో ఉర్దూ రాతలు ఉండడం చూసి తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక హిందూ పాఠశాలలో అమీర్ ఖాన్‌ను ప్రిన్సిపల్‌గా, ఆలీమాను ఉపాధ్యాయురాలిగా నియమించిన తర్వాత అక్కడ ఏం బోధిస్తున్నారో పాఠశాల యాజమాన్యం పర్యవేక్షించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ, బజరంగ్ దళ్, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఆరోపించారు. హిందూ పిల్లలకు ఉర్దూ పాటలు బోధించిన వారిపై, అలాగే అలాంటి బోధన జరిగేలా చేసిన పాఠశాల యాజమాన్యం పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
భరత్ చంద్ర పాఠశాలలో చదువుతున్న తన కుమారుడి ప్రవర్తన, మాట తీరు, అలవాట్లలో మార్పులు గమనించిన వడ్రంగి రమేష్ తన కుమారుడిని ప్రశ్నించగా, పాఠశాలలోనే ఇవన్నీ నేర్పుతున్నారని అతడు చెప్పినట్లు సమాచారం. అనంతరం ఆయన ఇతర విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్ దళ్, ఏబీవీపీ నాయకుల మద్దతుతో పాఠశాల యాజమాన్యాన్ని నిలదీస్తూ ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్, రూరల్ సీఐ జాన్ రెడ్డి, ఇతర పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి ఎలాంటి ఘర్షణలు జరగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం అధికారులు విద్యార్థులను ప్రశ్నించి, వారి నోటుబుక్కులను పరిశీలించి వివరాలు సేకరించారు. తర్వాత భరత్ చంద్ర పాఠశాల కరస్పాండెంట్ మల్లయ్య, ప్రిన్సిపల్ అమీర్ ఖాన్‌ను ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్లు కాందేష్ ప్రశాంత్, శ్రావణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు షేర్ల గంగాధర్ (గంగోలి) గౌడ్, బీజేపీ నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, అరుణ్, పోల్కం వేణు, రాజశేఖర్, దశరథ్, అజయ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.






