- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్యాంగులకు ప్రభుత్వం భరోసా : మంత్రి సీతక్క
దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలెన్ కెల్లర్ జయంతిని పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వం వారి సంక్షేమం దిశగా మరో కీలక అడుగు వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలెన్ కెల్లర్ జయంతిని పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వం వారి సంక్షేమం దిశగా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని 14 నైబర్‌హుడ్ సెంటర్లకు ఈ-ఆటోలను మంత్రి సీతక్క శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దివ్యాంగుల పట్ల జాలి చూపడం కాకుండా, సమాజంలో సమాన భాగస్వాములుగా చూడటమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకు పైగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. స్త్రీనిధి, మహిళా సంఘాల ద్వారా సుమారు రూ. 42 కోట్ల పైగా రుణాలు అందజేశామని, 82 వేల మందికి పైగా సభ్యులకు ఉపాధి, రుణాలు, పునరావాస కల్పించామని తెలిపారు. ప్రస్తుతం 26 జిల్లాల్లో 74 నైబర్‌హుడ్ సెంటర్ల ద్వారా 3 వేల మంది పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వంటి సేవలు అందుతున్నాయని వివరించారు. గతంలో రవాణా సౌకర్యాలు లేక కేంద్రాలకు రాలేని దివ్యాంగ పిల్లల కోసం ఈ-ఆటోలు ఎంతో ఊరటనిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఆటిజం, మేధోవైకల్యం ఉన్న పిల్లలు క్రమం తప్పకుండా థెరపీ పొందేందుకు ఈ ఉచిత రవాణా సౌకర్యం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తల్లులు తమ పిల్లల్లో వస్తున్న మార్పులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. నైబర్‌హుడ్ సెంటర్ల వల్ల తమ పిల్లలు నడవగలుగుతున్నారని, మాటలు నేర్చుకుంటున్నారని, క్రీడల్లోనూ రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, ఐఓసి ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






