- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిశిరాత్రి నిశ్శబ్దంలో.. విష సంస్కృతి !
పగలు చూస్తే పచ్చని చేలు, కష్టపడే రైతులు, ప్రశాంతమైన వాతావరణం.

దిశ, వెంకటాపూర్,రామప్ప : పగలు చూస్తే పచ్చని చేలు, కష్టపడే రైతులు, ప్రశాంతమైన వాతావరణం. కానీ, సరిగ్గా రాత్రి పది దాటాక వెంకటాపూర్ మండలంలోని ఇంచించెర్వుపల్లె ఊరి ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. చీకటి ముసుగులో, గుట్టల వెనుక నుంచి ఒక రకమైన ఘాటైన, పుల్లటి వాసన గాల్లోకి లేస్తుంది. అది పొగ కాదు ఒక తరాన్ని దహించివేస్తున్న గుడుంబ మత్తు. యువతను మింగేస్తున్న 'సారా' వల ఈ ఊరి అడవి పొలిమేరల్లో పాత డ్రమ్ములు, కుళ్లబెట్టిన బెల్లం ఊటలదే ఇప్పుడు రాజ్యం. కేవలం 20 రూపాయల ఖర్చుతో తయారయ్యే ఒక సీసా సారా, మార్కెట్లో 70 రూపాయలకు అమ్ముడవుతోంది. ఈ మూడు రెట్ల లాభమే ఊరి కుర్రాళ్లను చదువుకు దూరం చేస్తోంది. రెండు గంటలు కష్టపడితే ఐదు వందలు వస్తున్నాయి. చదివితే ఏమొస్తుంది ? ఇది ఈ ఊరి 18-25 ఏళ్ల యువత నోట వినబడుతున్న ప్రమాదకరమైన మాట. గడచిన కొన్ని సంవత్సరాల నెలల చీకటి నిజాలు కొంత మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత చదువు ఆపేశారు. టెక్నికల్/ఇంజనీరింగ్ సీట్లను వదులుకున్నారు. పలువురు విద్యార్థులు ఐతే డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌కు కూడా హాజరుకాలేదు.
పుస్తకాలు పట్టాల్సిన చేతులు, కెమికల్స్ కలిపిన సారా డ్రమ్ములను తిప్పుతున్నాయి. ఫలితం కడుపునొప్పి, వాంతులు, చూపు మసకబారడం. ఇలాగే తాగితే కళ్లు పోతాయి అని డాక్టర్లు హెచ్చరిస్తున్నా, తొందరగా డబ్బు సంపాదించాలనే పిచ్చి ముందు ఆ భయం పనిచేయడం లేదు. అడవి దారుల్లో దొంగ రవాణా పగలు నిద్రపోయే ఈ ఊరు, రాత్రి ఒంటి గంటకు మేల్కొంటుంది. ఇంచించెర్వుపల్లె గ్రామ కేంద్రంగా చుట్టుపక్కల జిల్లాలకు నెట్‌వర్క్ సాగుతోంది.
రూట్ మ్యాప్, మెయిన్ రోడ్డు దాటితే పట్టుబడతామనే భయంతో అడవి దారులు, కాలువ గట్లు, పొలం బాటలనే వాడుకుంటారు, ములుగు, పరకాల, భూపాలపల్లి సరిహద్దులే వీరి టార్గెట్, ఒక చిన్న గోనె సంచిలో 20 సీసాలు, బైక్ సీటు కింద గుట్టుగా దాచడం. కుక్క మొరిగితే చాలు, లైట్లు ఆపేసి పొలాల్లో నక్కడం, బైక్ పంక్చర్ అయితే సీసాలను మట్టిలో పాతిపెట్టి, తర్వాత వచ్చి తీసుకెళ్లేంత పక్కా ప్లానింగ్, చదువు పై పెట్టని శ్రద్ధను యువత ఈ దొంగ రవాణా పై పెడుతోంది. ఇప్పుడు చుట్టుపక్కల ఊర్లలో "ఇంచించెర్వుపల్లె సరుకుకు డిమాండ్ పెరగడం, ఈ విష వలయాన్ని మరింత పెద్దది చేస్తోంది. కూలి పని చేస్తే వచ్చే రూ.300లో, రూ.200 సారా సీసాకే పోతోంది. ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా తాగడం మానడం లేదు. దారుణం ఏంటంటే, ఇంట్లో ఉన్న 25 కిలోల రేషన్ బియ్యాన్ని రూ.600 కి అమ్మేసి మరీ సారా కొంటున్నారు. ఇల్లు ఇప్పుడొక యుద్ధభూమి,చెల్లెలి పెళ్లికి పైసా లేదు, తమ్ముడి స్కూల్ ఫీజు కట్టడానికి అణా లేదు. కిరాణా కొట్టు వాడు అప్పు ఇవ్వడం మానేశాడు. నేను కన్నది ఇందుకేనా అని రాత్రంతా ఏడుస్తున్న తల్లులు ఈ ఊరిలో పదుల సంఖ్యలో ఉన్నారు. కొడుకు మత్తులో నిద్రపోతుంటే, తల్లి కన్నీళ్లతో మేల్కొంటోంది. ఈ మత్తు ఇలాగే ఉంటే, మరో ఐదేళ్లలో ఇంచించెర్వుపల్లె ఘోరమైన పరిస్థితులు రాబోతున్నాయి పట్టభద్రులు లేని ఊరు ఊరిలో ఒక్క చదువుకున్న కుర్రాడు కూడా మిగలడు. అంతా కూలీలుగానో,జైలు పక్షులుగానో మిగిలిపోతారు.
సంస్కృతి వినాశనం పండగలకు సందడి లేదు, జాతరలకు చందాలు లేవు. దేవాలయాలు వెలవెలబోతున్నాయి. ఆర్థిక పతనం వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు. రేపు తాగడానికి భూములు అమ్మే పరిస్థితి వస్తుంది. సామాజిక వెలివేత పొరుగు ఊర్ల వారు ఈ ఊరి పేరు వింటేనే అదా... అది సారా ఊరు అని పెళ్లి సంబంధాలు చేసుకోవడానికి కూడా భయపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ క్యాన్సర్‌కు కేవలం ఎక్సైజ్, పోలీసుల లాఠీ దెబ్బలు మాత్రమే మందు కాదు. యువత ఆలోచనా విధానాన్ని మార్చాలి, ఉపాధి అవకాశాలు ఊరి యువతకు కుట్టు మిషన్లు, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్, మొబైల్ రిపేరింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాలి. ఆటల వైపు మళ్లించడం ఊరిలో ఒక మంచి ఆట స్థలం ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తే, సాయంత్రం వేళల్లో యువత అటు వైపు వెళ్తుంది. రాత్రి 10 దాటాక పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించాలి. ఇంచించెర్వుపల్లె యువతను కాపాడుకోవడం అంటే ఒక ఊరి భవిష్యత్తును కాపాడుకోవడమే. ఇప్పుడైనా సమాజం, అధికారులు స్పందించకపోతే... రేపు ఇంచించెర్వుపల్లె కేవలం ఒక 'మత్తు సమాధిగా మిగిలిపోతుంది.






