- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీ-7 సదస్సు: సిగరెట్ మానేసిన ఇటలీ ప్రధాని మెలోనీ.. మోడీతో ‘మెలోడి’ ముచ్చట్లు
ఫ్రాన్స్‌లోని ఎవియాన్ వేదికగా జరుగుతున్న జి-7 (G-7) సదస్సులో కీలక ప్రపంచ సమస్యలపై చర్చల మధ్య కొన్ని ఆసక్తికర, సరదా సంఘటనలు చోటుచేసుకున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫ్రాన్స్‌లోని ఎవియాన్ వేదికగా జరుగుతున్న జి-7 (G-7) సదస్సులో కీలక ప్రపంచ సమస్యలపై చర్చల మధ్య కొన్ని ఆసక్తికర, సరదా సంఘటనలు చోటుచేసుకున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి సీరియస్ అంశాలపైనే కాకుండా, అగ్రదేశాల అధినేతలు తమ వ్యక్తిగత అలవాట్ల గురించి సరదాగా ముచ్చటించుకున్న దృశ్యాలు మైక్‌లకు చిక్కి వైరల్‌గా మారాయి.
సిగరెట్ మానేసిన మెలోనీ
సమావేశానికి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీల రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో తోటి నేతలతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ముచ్చటించారు. తనకు కాఫీ కావాలని మెలోనీ అనగా, జర్మనీ ఛాన్సలర్ ఫెడ్రిక్ మెర్జ్ నవ్వుతూ ‘సిగరెట్ కూడానా?’ అని అడిగారు. దానికి మెలోనీ ‘నేను మానేశాను.. ఒక నెల క్రితమే వదిలేశా’ అని బదులివ్వగా.. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ‘బ్రావో’ అంటూ ఆమెను అభినందించారు. ఇదే సమయంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అడిగిన ప్రశ్నకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా స్పందిస్తూ.. తాను 2005లోనే (21 ఏళ్ల క్రితం) ధూమపానం మానేశానని, మళ్లీ ఆ అలవాటు జోలికి వెళ్లలేదని తెలిపారు.
మోడీతో ‘మెలోడి’ సందడి
ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన మెలోనీ సరదాగా పలకరించారు. ‘మిమ్మల్ని మళ్లీ కలవడం సంతోషం. ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే అత్యంత ఫేమస్’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల వీరిద్దరి ‘మెలోడి టాఫీ’ వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ సాధించిన విషయం తెలిసిందే.
ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
సదస్సులో డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి సైతం ఆసక్తి రేపింది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ట్రంప్ గ్రీన్‌ల్యాండ్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా ‘మీకు అర్థమైందా.. గ్రీన్‌ల్యాండ్’ అని ట్రంప్ అన్న మాటలు హాట్ మైక్‌లో రికార్డయ్యాయి. అలాగే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పక్కనపెట్టిన వాచ్‌ను తనకు ఇచ్చేయాలని ట్రంప్ సరదాగా కోరడం గమనార్హం.






