యాప్ ద్వారానే రైతులకు యూరియా, ఎరువులు

by Batti.Sumithra |

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ రైతులకు ఎరువులు సక్రమంగా, పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో నూతనంగా ఫెర్టిలైజర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

యాప్ ద్వారానే రైతులకు యూరియా, ఎరువులు
X

దిశ, ఏన్కూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ రైతులకు ఎరువులు సక్రమంగా, పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో నూతనంగా ఫెర్టిలైజర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ప్రతి రైతుకు వారు సాగు చేస్తున్న విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు అందేలా ఈ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఏన్కూరు మండలంలో నేటి నుంచి రైతులకు యాప్ ద్వారా ఎరువుల పంపిణీ ప్రారంభమైంది. రైతులు తమ సెల్‌ఫోన్‌లో యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకుంటే, వారి నమోదిత మొబైల్ నంబర్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని ధృవీకరించిన అనంతరం, రైతు పాస్‌బుక్‌లో నమోదైన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కేటాయించిన ఎరువులను పొందే అవకాశం ఉంటుంది.

ఈ విధానం అమలులోకి రావడంతో ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూల్లో నిలబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా రైతులకు గణనీయమైన ఉపశమనం కలగనుంది. అలాగే, ఒక మండలానికి కేటాయించిన ఎరువులు అదే మండలంలోని రైతులకు మాత్రమే అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఎరువులు ఇతర ప్రాంతాలకు లేదా పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోకుండా నియంత్రించడంతో పాటు, నిజమైన రైతులకు సకాలంలో అందే అవకాశం ఏర్పడనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన విధానం రైతులకు ఎంత మేరకు ప్రయోజనం చేకూరుస్తుందో, అలాగే ఎరువుల అక్రమ రవాణాను ఎంతవరకు అరికడుతుందో వేచి చూడాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story