- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడవి బిడ్డలకు ఆల్ టైం ఫేవరేట్.. జిన్న పండ్ల కోసం ఎగబడుతున్న జనం
ఆకాశం మేఘావృతమై తొలకరి జల్లులు పడుతున్నాయంటే చాలు, ఏజెన్సీ అడవుల్లో ఓ అద్భుతం పుట్టుకొస్తుంది.

దిశ, ఆళ్లపల్లి : ఆకాశం మేఘావృతమై తొలకరి జల్లులు పడుతున్నాయంటే చాలు, ఏజెన్సీ అడవుల్లో ఓ అద్భుతం పుట్టుకొస్తుంది. అదే "జిన్న పండు". వర్షం నీటితో పులకించిన అడవి తల్లి ప్రేమగా అందించే ఈ తీపి ఫలం కోసం ఇప్పుడు గిరిజన గ్రామాల్లో సందడి మొదలైంది.
వర్షాకాలపు కానుక..
జిన్న చెట్టు... చూడటానికి మామూలుగానే ఉంటుంది. కానీ జూన్ నుండి ఆగస్టు వరకు కురిసే వానల్లోనే దీని మహత్యం తెలుస్తుంది. చిన్న ఉసిరికాయ సైజులో, ముదురు నారింజ రంగులో మెరిసిపోతూ గుత్తులు గుత్తులుగా కాస్తుంది. పండును నోట్లో వేసుకుంటే చాలు - పుల్లగా, తియ్యగా, కొంచెం వగరుగా... ఓ రకమైన మత్తు రుచి. "ఈ రుచి నగరంలో దొరికే ఏ ఆపిల్‌కు, ద్రాక్షకు రాదు అని ఏజెన్సీ ప్రాంత వాసులు అంటూ ఉంటారు.
అడవి బిడ్డల ఆటపాట..
తెల్లారి వాన వెలిసిందో లేదో, గిరిజన పిల్లలు బుట్టలు పట్టుకుని అడవిలోకి పరుగు. రాళ్లు, ముళ్లు లెక్కచేయకుండా చెట్లు ఎక్కి పండ్లు కోస్తారు. ఆ పండ్లను ఆకులో పెట్టుకుని, ఉప్పు-కారం అద్దుకుని తింటుంటే ఆ కిక్కే వేరు. "స్కూల్ ఎగ్గొట్టి అయినా జిన్న పండ్లకు పోతాం. దొరికిన కాడికి తిని, ఇంటికి తెస్తారు.
పట్నం రుచికి ఏజెన్సీ రుచి..
ఇప్పుడు ఈ జిన్న పండ్లు అడవి దాటి పట్నం బాట పట్టాయి. కొత్తగూడెం మార్కెట్లలో చిన్న చిన్న గుట్టలుగా పోసి అమ్ముతున్నారు. కేజీ 80 నుండి 100 రూపాయలు పలుకుతోంది. "వానాకాలం వస్తే చాలు జిన్న పండ్ల కోసమే ఎదురు చూస్తాం. ఆరోగ్యానికి చాలా మంచిదని ఏజెన్సీ వాసుల నమ్మకం.
ఆరోగ్యాల జిన్న..
జిన్న పండులో సి-విటమిన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయని చెబుతూ ఉంటారు. రక్తహీనత, జీర్ణ సమస్యలకు మంచి మందుగా పనిచేస్తుందని గిరిజనుల నమ్మకం. జ్వరం వచ్చినప్పుడు జిన్న పండ్ల రసం తాగిస్తే తగ్గిపోతుందని అంటూ ఉంటారు.
కనుమరుగవుతున్న చెట్లు..
కానీ ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటే, అడవులు నరికివేతకు గురవ్వడంతో జిన్న చెట్లు తగ్గిపోతున్నాయి. "మా చిన్నప్పుడు ఊరికి చుట్టూ జిన్న చెట్లే. ఇప్పుడు అడవిలోపలికి పోతే తప్ప దొరకడం లేదు" అని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. వాన వెలిసిన తర్వాత మట్టి వాసనతో పాటు జిన్న పండ్ల వాసన కూడా ఏజెన్సీ గాలిలో కలిసిపోతుంది. ఇది కేవలం పండు కాదు.. అడవి బిడ్డల చిన్ననాటి జ్ఞాపకం, వర్షాకాలపు తీపి గుర్తు.






