- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో లారీ డ్రైవర్ మృతి
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని నందిని నగర్‌లో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, మక్తల్ : మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని నందిని నగర్‌లో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మసాలా ప్యాకెట్లతో వచ్చిన లారీ పై కప్పిన ప్లాస్టిక్ కవర్‌ను తొలగించే క్రమంలో విద్యుత్ తీగలు తగలడంతో డ్రైవర్ కుర్వ వెంకటేష్ (25) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి హమాలీలు వెంటనే వెంకటేష్‌ను ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వివరాల్లోకి వెళితే గద్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని దౌదర్‌పల్లి 7వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన కుర్వ వెంకటేష్ గత నాలుగేళ్లుగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం గద్వాల్ నుంచి మక్తల్‌కు మసాలా ప్యాకెట్ల లోడుతో వచ్చిన లారీ పై కప్పిన ప్లాస్టిక్ కవర్‌ను తొలగిస్తుండగా, కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంకటేష్‌కు భార్యతో పాటు నాలుగేళ్ల చిన్నారి కుమార్తె ఉంది. కుటుంబానికి ఆధారమైన వెంకటేష్ ఆకస్మిక మరణంతో గద్వాల్‌లోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికులను కూడా కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమా ?
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్నాయని, వాటిని వెంటనే సరిచేయాలని స్థానికులు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే విద్యుత్ తీగల మరమ్మతులు, మార్పులు కాంట్రాక్టర్ల పై ఆధారపడి ఉన్నాయని అధికారులు చెబుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఈ సమస్య పై వార్తా కథనం వెలువడిన నేపథ్యంలో, ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరు ? నిర్లక్ష్యానికి బాధ్యుల పై చర్యలు తీసుకుంటారా ? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.






