గ్రామానికి ప్రత్యేక శోభ.. చెట్ల పై వందలాది కొంగల సందడి

by Batti.Sumithra |

బజార్‌హత్నూర్ మండల కేంద్రంలోని భీమన్న కాలనీలో మంగళవారం రాత్రి కనిపించిన ప్రకృతి సోయగం స్థానికులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది.

గ్రామానికి ప్రత్యేక శోభ.. చెట్ల పై వందలాది కొంగల సందడి
X

దిశ, బజార్ హత్నూర్ : బజార్‌హత్నూర్ మండల కేంద్రంలోని భీమన్న కాలనీలో మంగళవారం రాత్రి కనిపించిన ప్రకృతి సోయగం స్థానికులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. కాలనీలోని చెట్ల పై వందలాది కొంగలు గుంపులుగా చేరి విశ్రాంతి తీసుకుంటూ కనిపించడంతో ఆ ప్రాంతం పక్షుల నిలయంగా మారింది. సాయంత్రం వేళ ఆకాశంలో విహరిస్తూ వచ్చిన కొంగలు ఒక్కసారిగా చెట్ల పై వాలడం, వరుసలుగా కూర్చొని రాత్రి బస చేయడం చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా మారింది. తెల్లని కొంగలతో నిండిపోయిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రకృతిలో భాగమైన ఈ అరుదైన దృశ్యం స్థానిక ప్రజలను మంత్రముగ్ధులను చేయడంతో పాటు చిన్నారుల్లోనూ ఆసక్తిని కలిగించింది. చెట్ల పై వందల సంఖ్యలో కొంగలు గుమికూడి ఉండటంతో కాలనీవాసులు వాటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పర్యావరణ సమతుల్యతకు పక్షులు ఎంతో ముఖ్యమని, ఇలాంటి దృశ్యాలు ప్రకృతి వైవిధ్యానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం, చెట్ల సంరక్షణ ఉంటేనే పక్షులు ఆశ్రయం పొందగలవని స్థానికులు పేర్కొన్నారు. "చెట్ల పై తెల్లని కొంగల సందడి.. భీమన్న కాలనీలో ప్రకృతి అందాల కనువిందు అంటూ ఈ దృశ్యం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story