ఎమ్మెల్యే చొరవతో విద్యార్థుల తాగునీటి సమస్యకు పరిష్కారం

by Batti.Sumithra |

వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా పాఠశాల యాజమాన్యాల పై ఉంటుంది.

ఎమ్మెల్యే చొరవతో విద్యార్థుల తాగునీటి సమస్యకు పరిష్కారం
X

దిశ, ఏన్కూర్ : వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా పాఠశాల యాజమాన్యాల పై ఉంటుంది. అయితే పాఠశాలలు ప్రారంభమై తరగతులు కొనసాగుతున్నప్పటికీ, తిమ్మరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్య అలాగే కొనసాగుతోంది. వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ పర్యటనలో భాగంగా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న తాగునీటి ప్రధాన సమస్య ఆయన దృష్టికి వచ్చింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి, తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి సుమారు రూ.4 లక్షలు మంజూరు చేస్తూ పాఠశాలకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాల విద్యార్థులతో పాటు గ్రామస్థులకు కూడా ఉపయోగపడేలా ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఇందుకు సంబంధించిన నిధుల మంజూరు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) ద్వారా సంబంధిత సీపీఓకు లేఖ పంపాలని ఆదేశించారు. అదేవిధంగా అక్కడే ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ నరసింహారావుకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ తీసుకున్న ఈ నిర్ణయం పై పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే చొరవతో శాశ్వత పరిష్కారం లభించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

Next Story