తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. విద్యార్థులతో టిఫిన్ చేసిన సీఎం రేవంత్

by Ramesh Naini |

ప్రభుత్వ విద్యను సరికొత్త దిశలో నడిపించేందుకు సంకల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ను రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో బుధవారం ఘనంగా ప్రారంభించింది.

తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. విద్యార్థులతో టిఫిన్ చేసిన సీఎం రేవంత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ విద్యను సరికొత్త దిశలో నడిపించేందుకు సంకల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (TPS)ను రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో బుధవారం ఘనంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాఠశాల భవనాన్ని ప్రారంభించి, టీపీఎస్ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం ‘అల్పాహార పథకాన్ని’ ప్రారంభించిన సీఎం, విద్యార్థులతో కలిసి స్వయంగా టిఫిన్ చేశారు.

కార్పొరేట్ శైలిలో.. రూ.15 కోట్లతో నిర్మాణం

కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూ. 15 కోట్ల వ్యయంతో ఈ పాఠశాలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తి ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్యాబోధన అందిస్తారు. ప్రస్తుతం ఇక్కడ 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్ వంటి ఆటల కోసం ప్రత్యేక మైదానాలు, కోచ్‌లను అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల విద్యార్థుల కోసం 5 ప్రత్యేక స్కూల్ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా అందిస్తారు.

పైలట్ ప్రాజెక్ట్‌గా 4 స్కూళ్లు.. లక్ష్యం 100

ప్రభుత్వం ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద మొదటి విడతలో నాలుగు పాఠశాలల్లో ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలు ఇందులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు.

Next Story