పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పు.. గ్రామాల రక్షణకు PPA హామీ : హరీష్ రావు

by Naga Rani Yarlagadda |

పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణ సరిహద్దు గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉందని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఇచ్చిన వినతిపత్రంపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) సానుకూలంగా స్పందించింది.

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పు.. గ్రామాల రక్షణకు PPA హామీ : హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణ సరిహద్దు గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉందని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఇచ్చిన వినతిపత్రంపై కేంద్రప్రభుత్వానికి చెందిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) సానుకూలంగా స్పందించింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను, ప్రాణాలను కాపాడేందుకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తున్నట్లు PPA స్పష్టం చేసిందన్నారు. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై తెలంగాణ ప్రజల ఆందోళనలను కేంద్రం అధికారికంగా గుర్తించడం కీలక పరిణామంగా పేర్కొన్నారు. ప్రభావిత గ్రామాల రక్షణకు హామీ ఇవ్వడం స్వాగతించదగిన విషయమని హర్షం వ్యక్తం చేశారు. అలాగే రైతులు, గిరిజనులు, గ్రామీణ ప్రజల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని, పునరావాసం, రక్షణ చర్యలు సమయానికి అమలు కావాలని కోరారు.

తెలంగాణ గ్రామాల భద్రత విషయంలో రాజీ ఉండకూడదన్నారు. పోలవరం వల్ల ప్రభావితమయ్యే ప్రతి కుటుంబానికి న్యాయం జరగాలని హరీష్ రావు ఆకాంక్షించారు. కేంద్రం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలయ్యేలా చూడాలన్నారు. రైతుల భూములు, జీవనోపాధి రక్షించబడాలని, ప్రజల ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యత కావాలని ఆశించారు. కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించి, ఈ హామీలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో సకాలంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాగా.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) వల్ల ముంపునకు గురయ్యే తెలంగాణ పరిధిలోని అన్ని ప్రాంతాలను తగిన ఇంజనీరింగ్ చర్యల ద్వారా రక్షించడం జరుగుతుందని, లేదా పునరావాస-పునర్నిర్మాణ (R&R) చట్టం కింద ఆ భూములను సేకరించి నష్టపరిహారం అందిస్తామని అథారిటీ పునరుద్ఘాటించింది. ఏప్రిల్ 8, 2025న జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నట్లు పీపీఏ తన లేఖలో పేర్కొంది. గోదావరి బేసిన్ పరిధిలోని తెలంగాణ ప్రజల జీవనోపాధిని, వ్యవసాయ భూములను రక్షించడానికి శాస్త్రీయ అంచనాలు, వరద నివారణ చర్యలు, రక్షణ వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించి అమలు చేస్తామని అథారిటీ వెల్లడించింది.

Next Story