ఎక్కడి చెత్త అక్కడే.. గ్రామంలో వెదజల్లుతున్న దుర్వాసన

by Batti.Sumithra |

డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, ప్రాథమిక సౌకర్యాల నిర్వహణ కొరవడి గ్రామం సమస్యల వలయంగా మారింది.

ఎక్కడి చెత్త అక్కడే.. గ్రామంలో వెదజల్లుతున్న దుర్వాసన
X

దిశ, డోంగ్లి (మద్నూర్) : డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, ప్రాథమిక సౌకర్యాల నిర్వహణ కొరవడి గ్రామం సమస్యల వలయంగా మారింది. పశువుల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టె నిరుపయోగంగా మారడమే కాకుండా, గ్రామంలో చెత్తాచెదారం పోగుపడి, మురికి కాలువలు పూడిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిరుపయోగంగా మారిన నీటి తొట్టె..

గ్రామంలో పశువుల కోసం నిర్మించిన సిమెంట్ నీటి తొట్టె చుట్టూ గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. తొట్టెలో నీరు నిల్వ లేక, మురికి పేరుకుపోవడంతో పశువులు దరిచేరడం లేదు. పట్టించుకునే నాథుడు లేక తొట్టె శిథిలావస్థకు చేరుకుంది. దీనిపై గ్రామస్తులు పలుమార్లు చెప్పినా పంచాయతీ అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

చెత్త కుప్పలతో దుర్గంధం..

ఇదే సమయంలో గ్రామంలోని ఖాళీ స్థలాలు, రోడ్డు పక్కల చెత్త కుప్పలుగా పేరుకుపోయాయి. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, పాత సామాన్లు యథేచ్ఛగా పడేసి ఉండడంతో పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. పారిశుధ్య కార్మికులు సరిగా విధులు నిర్వహించడం లేదని, చెత్తను ఎత్తేయడం లేదని స్థానికులు వాపోతున్నారు.

పూడిన కాలువలతో ప్రమాదం..

ఇక మురికి కాలువల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పూడిక పట్టి మురికినీరు సాఫీగా ప్రవహించడం లేదు. దీంతో వర్షం పడినప్పుడు నీరు రోడ్లపైకి వచ్చి దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. అంటువ్యాధుల ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు కనీసం పూడిక తీయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్ గ్రామ పంచాయతీలో శుభ్రత అనేదే కనిపించడం లేదు. నీటితొట్టె పాడైపోయింది, చెత్త అంతా రోడ్డు మీదే ఉంది, కాలువలు మురికిగా మారాయి. పన్నులు కడుతున్నా సౌకర్యాలు మాత్రం అందడం లేదు అని సిర్పూర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సిర్పూర్ గ్రామం పై అధికారులు దృష్టి..

తక్షణం స్పందించి నీటి తొట్టెలను శుభ్రం చేసి వినియోగంలోకి తేవాలని, గ్రామంలో పోగుపడిన చెత్తను తొలగించి, మురికి కాలువల్లోని పూడికను తీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా సిర్పూర్ గ్రామ పంచాయతీ అధికారులు కళ్లు తెరిచి గ్రామాభివృద్ధి పై దృష్టి పెడతారా ? లేదా ? అనేది వేచి చూడాలి.

వారం రోజుల్లో పూర్తి చేయిస్తా ఎంపీడీవో..

ఈ సమస్యల పై డోంగ్లి మండల ఎంపీడీవో జగదీష్ అనిల్ కుమార్‌ను ‘దిశ’ వివరణ కోరగా స్పందించారు. నీటి తొట్టెకు లీకేజీలు ఏర్పడ్డాయని, కొత్తది నిర్మించేందుకు గ్రామపంచాయతీ సభలో తీర్మానం చేసి, కొత్త నీటి తొట్టె నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామపంచాయతీలో బడ్జెట్ లేకపోవడం వలన ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. మురికి కాలువల్లో పూడిక, రోడ్ల పక్కన చెత్తాచెదారాన్ని వారం రోజుల్లో పరిశుభ్రం చేస్తామన్నారు. గ్రామంలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎంపీడీవో వివరించారు.

Next Story