తెలుగు రాష్ట్రాల్లో... ‘స్వతంత్ర సినిమా వీక్షణ సంస్కృతి’ ఎక్కడ?

by Muthe.Rajitha |

సినిమా అంటే సాధారణంగా మనకు కనిపించేవి భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు, వందల కోట్ల వసూళ్లు, లాభాలు లేదా నష్టాలు.

తెలుగు రాష్ట్రాల్లో... ‘స్వతంత్ర సినిమా వీక్షణ సంస్కృతి’ ఎక్కడ?
X

సినిమా అంటే సాధారణంగా మనకు కనిపించేవి భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు, వందల కోట్ల వసూళ్లు, లాభాలు లేదా నష్టాలు. అయితే ఈ ప్రధాన స్రవంతికి సమాంతరంగా మరో సృజనాత్మక ప్రవాహం నిరంతరం కొనసాగుతూనే ఉంది. అదే స్వతంత్ర సినిమా (Independent Cinema). కొత్త ఆలోచనలు, కొత్త కథనాలు, కొత్త దృక్కోణాలు, సమాజపు అసలయిన ముఖచిత్రం ఎక్కువగా ఈ సినిమాల్లోనే అవిష్క్రుతమవుతాయి.

భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ దర్శకులలో చాలామంది స్వతంత్ర సినీ సంప్రదాయం నుంచే ఎదిగారు. సత్యజిత్ రే, శ్యామ్ బెనెగల్, అదూర్ గోపాలకృష్ణన్ వంటి దిగ్గజాల నుంచి నేటి అనురాగ్ కశ్యప్, రీమా దాస్, చైతన్య తమ్హానే వంటి దర్శకుల వరకు ఈ స్వతంత్ర సినిమాకు కొత్త భాషను, కొత్త సౌందర్యాన్ని అందించింది. .. విమర్శనాత్మక దృష్టి లేకుండా సంస్కృతి ఉండదు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రజల్లో చైతన్యం రావాల్సి వుంది.

మన సినిమాలపై ప్రపంచ ప్రేక్షకుల కన్ను

పెద్ద స్టూడియోలు, కార్పొరేట్ నిర్మాణ సంస్థల నియంత్రణకు వెలుపల నిర్మితమయ్యే చిత్రాలను సాధారణంగా స్వతంత్ర సినిమాలుగా పరిగణిస్తారు. వాటిల్లో ప్రధానంగా తక్కువ బడ్జెట్, వ్యక్తిగత, మౌలిక కథనం,కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు,స్థానిక, ప్రాంతీయ జీవన వాస్తవాలు,సృజనాత్మక స్వేచ్ఛలు కనిపిస్తాయి. వాటితో పాటు వాణిజ్య విజయమే లక్ష్యంగా కాకుండా, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం ఈ సినిమాల్లో కనిపిస్తుంది. భారతీయ సినిమాను గత దశాబ్ద కాలంగా గమనిస్తే ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తుంది. భారీ బడ్జెట్‌లు, పాన్ ఇండియా చిత్రాల హడావుడి మధ్యలోనే చిన్న సినిమాలు, స్వతంత్ర చిత్రాలు తమదైన ముద్ర వేస్తున్నాయి. ఒకప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్స్‌కే పరిమితమైన ఇండిపెండెంట్ సినిమాలు ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

చిన్న సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు

మన తెలుగులో స్వతంత్ర సినిమాల పరిస్థితి గురించి ఆలోచిస్తే మన పరిశ్రమ ప్రస్తుతం ఎక్కువగా భారీ పెట్టుబడులు, స్టార్ ఆధారిత వ్యవస్థ చుట్టూ తిరుగుతోంది. అయినప్పటికీ కొన్ని ఆశాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయి. డిజిటల్ సాంకేతికత వల్ల యువదర్శకులు తక్కువ ఖర్చుతో సినిమాలు నిర్మించే అవకాశం. ఇక ఓటీటీ వేదికలు ఎంతోకొంత ఊరట. థియేటర్లలో విడుదలకు అవకాశం రాకపోయినా ఓటీటీలు ప్రత్యామ్నాయ వేదికలుగా మారాయి. చిన్న సినిమాలకు ప్రేక్షకులను చేరుకునే అవకాశం కొంత పెరిగింది. నిజానికి తెలుగు సమాజంలో చెప్పాల్సిన కథలు ఇంకా అపారంగా ఉన్నాయి.

స్వతంత్ర సినిమాలకు తెలంగాణ కేంద్రం కావాలి

తెలంగాణ ఉద్యమం తర్వాతి సామాజిక మార్పులు, వలస కార్మికుల జీవితం, రైతాంగ సంక్షోభం,పట్టణీకరణ ప్రభావం,దళిత, బహుజన జీవిత అనుభవాలు,మహిళల జీవితాలు,చిన్న పట్టణాల సంస్కృతి ఇలాంటి అనేక అంశాలు స్వతంత్ర సినిమాలకు విస్తృతమైన కథా భూమికను అందిస్తాయి. జాగ్రత్తగా చూస్తే మలయాళ సినిమా విజయాలు మనకు గొప్ప పాఠం చెబుతాయి. పెద్ద బడ్జెట్ లేకపోయినా మంచి కథ, నిజాయితీ గల కథనం ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవచ్చని ఆ సినిమాలు నిరూపించాయి. తెలుగు భాషలో కూడా అలాంటి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ జీవితం, భాష, సంస్కృతి, జానపద సంపద, ప్రాంతీయ చరిత్రల ఆధారంగా రూపొందే చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగలవు. అయితే ప్రధాన అడ్డంకులేమిటి అని చూస్తే పెట్టుబడుల కొరత,థియేటర్ల దొరక్కపోవడం, పెరిగిన ప్రచార వ్యయం, మరోపక్క స్టార్ వ్యవస్థ చూపించే ఆధిపత్యం, ఒకప్పుడు వున్న ఫిల్మ్ సొసైటీ సంస్కృతి బలహీనపడి పోవడం ఈ సమస్యలను అధిగమించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రోత్సాహం కరువయింది.

సినిమా వీక్షణ సంస్కృతి’ని నిర్మించడం సాధ్యమేనా?

ప్రదర్శనావకాశాలు లేకుండా ఈ రోజుల్లో నిజంగా ఒక ‘సినిమా వీక్షణ సంస్కృతి’ని నిర్మించడం సాధ్యమేనా? తెలుగులో స్వతంత్ర సినిమా ఇప్పుడే తన నిజమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. కథల కొరత లేదు. ప్రతిభ కొరత లేదు. అవసరమైంది సరైన వేదికలు, సహకారం, ధైర్యం మాత్రమే. ఒకప్పుడు బెంగాలీ సినిమా, తర్వాత మలయాళ సినిమా భారతీయ సినీ భాషను మార్చినట్లే, రాబోయే దశాబ్దంలో తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాల జీవన వాస్తవాలను ప్రతిబింబించే స్వతంత్ర తెలుగు సినిమా కూడా భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాయగలదు. పెద్ద సినిమాలు మార్కెట్‌ను గెలుచుకుంటాయి.

స్వతంత్ర సినిమాలు కాలాన్ని గెలుచుకుంటాయి. కానీ అర్థవంతమయిన స్వతంత్ర సినిమా లను ప్రదర్శించే వేదికలు కరువయ్యాయి. అదీ మన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విజాగ్, విజయవాడ లాంటి నగరాల్లో అటు ప్రభుత్వ వేదికలు కానీ ప్రైవేటు లేదా స్వచ్చంద సంస్థల వేదికలు గాని లేకుండా పోయాయి. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వుండి, వ్యాపార సినిమాకు రెట్లు షోలు పెంచి ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఇటీవల ముంబై లో ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ (MAMI) వారానికొకసారి ప్రదర్శనలను ప్రారంభించింది. స్వతంత్ర ఫీచర్ చిత్రాలను లఘు చిత్రాలతో జతచేసి చూపిస్తున్నారు. ఇక ఫిల్మ్ ఫెస్టివల్‌లను మినహాయిస్తే, స్వతంత్ర సినిమాకు స్థిరమైన సంస్థాగత వేదికలు దేశమంతా చాలా కొరతగా ఉన్నాయి. కొద్ది చిత్రాలు మాత్రమే స్ట్రీమింగ్ వేదికలకు చేరుకుంటాయి. మిగతావి గుర్తింపులేకుండానే కనుమరుగైపోతున్నాయి.

విమర్శా దృష్టి లేకుండా సంస్కృతి ఉండదు

అదే సమయంలో భారతీయ ప్రేక్షకులను ప్రపంచ సినిమా వారసత్వంతో పరిచయం చేసే కొన్ని సంస్థాగత ప్రయత్నాలు ముంబై లాంటి చోట్ల కొనసాగుతున్నాయి. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతి గురువారం ముంబైలోని రీగల్ సినిమా థియేటర్‌లో పాత, ప్రఖ్యాత, పునరుద్ధరించబడిన చిత్రాలను ప్రదర్శిస్తోంది. వికల్ప్ సంస్థ గత పదిహేనేళ్లుగా ప్రతి నెల చివరి శుక్రవారం ముంబైలోని పృథ్వీ హౌస్‌లో రాజకీయ చైతన్యంతో కూడిన చిత్రాలను ప్రదర్శిస్తోంది. పుణెలోని నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా మరియు ముంబైలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా ప్రతి శనివారం చిత్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. కానీ తప్పనిసరిగా ఒక సంస్కృతిని మాత్రం నిర్మించలేకపోతున్నాయి. ఎందుకంటే విమర్శనాత్మక దృష్టి లేకుండా సంస్కృతి ఉండదు.అందుకే ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రజల్లో చైతన్యం రావాల్సి వుంది.

వారాల ఆనంద్

94405 01281

Next Story