ఓ భావోద్వేగ ప్రయాణం... ‘సింగ్ గీతం’

by Muthe.Rajitha |

మనిషి, ప్రకృతుల మధ్య కనిపించక ‘వినిపించే’ భావోద్వేగ రాగ ప్రయాణం వర్తమానంలో గుర్తించేవారు కరువయ్యారు.

ఓ భావోద్వేగ ప్రయాణం... ‘సింగ్ గీతం’
X

మనిషి, ప్రకృతుల మధ్య కనిపించక ‘వినిపించే’ భావోద్వేగ రాగ ప్రయాణం వర్తమానంలో గుర్తించేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో ‘సింగ్ గీతం’ ఎంతమందిని కదిలిస్తుందనేది ప్రశ్న సింగీతం శ్రీనివాసరావుది తొమ్మిదిన్నర దశాబ్ధాల జీవన ప్రయాణం. ప్రయోగాలు ఆయనకు ప్రాణం. విచిత్ర సోదరులు, ఆదిత్య 369, పుష్పక విమానం వంటివి కొన్ని ఉదాహరణలు. ఇంత పెద్ద వయసులో ప్రస్తుతం ఆయన తీసిన వినూత్న చిత్రం సింగ్-గీతం.

కథేమిటి..

ఆంధ్రప్రదేశ్ లో ‘కుబేరపుర’మనే ఓ ఊహాజనిత గ్రామం. అక్కడ బ్రహ్మయ్య (బెనర్జీ), అతని కూతురు రేణు (శాలిని కొండేపూడి) కలసి మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు. వ్యాపార ప్రయోజనాలకోసం ఆ గ్రామంలో ఉన్న చివరి పెద్ద చెట్టును నరికి వేస్తారు. ఆ చెట్టును ఎంతగానో ప్రేమించే గౌరి (అహిల్యా బమ్రూ) ఎంతో వేదనకు గురవుతుంది. బాధగా గ్రామదేవత ‘కుబేరుడుని’ ప్రార్ధిస్తుంది. అతడు ఆమె వేదనను అర్ధం చేసుకుంటాడు. ఆ తరువాత ‘కుబేరపురం’లో చిత్ర విచిత సంఘటనలు చోటుచేసుకుంటాయి. వాటి వెనుకున్న రహస్యాలు, వాటివల్ల ఆ పల్లె ప్రజలు ఎదుర్కున్న పరిణామాలు, చివరకు ప్రకృతి, మానవ సంబంధాలపై ఇచ్చే సందేశమే చిత్రం.

తెలుగులో అసాధారణ చిత్రం

చిత్రం గురించి.. ఇది సాధారణ చిత్రం కాదు. పాన్ ఇండియా పేరుతో పాత చింతకాయ పచ్చడి వంటి కథలతో వస్తున్న చిత్రాలకు భిన్నమైనది. మ్యూజికల్ ఫాంటసీ. హాలీవుడ్, యూరోపియన్ సినిమాలలో కనిపించే ఒపెరా శైలిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారాయన. సినిమా ప్రారంభమయిన అరగంట వరకు ఓ క్రొత్తదయిన అనుభూతి ప్రేక్షకుణ్ణి కదిలిస్తుంది. ఒకసారి కనెక్టయితే సినిమా తన ప్రపంచంలోకి పూర్తిగా లాక్కు పోతుంది. ఇందులో పాత్రలు సంభాషణలు చెప్పవు. వాటి మాటలే పాటలుగా మారతాయి. సాధారణ, వ్యాపారాత్మక, ‘కథ’ల్లేని చిత్రాలకు అలవాటుపడిన ప్రేక్షకులకు ఇది పూర్తిగా విభిన్నమైన కథన శైలి కలిగిన చిత్రం. మొదటి సగం ప్రపంచ నిర్మాణం, పాత్రల పరిచయం వంటివి కనిపిస్తాయి. రెండవ సగంలో మానవత్వం, ప్రకృతి, భావోద్వేగాలు, సామాజిక సందేశం దృశ్యమవుతాయి. ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లు చిత్రానికి ప్రధాన బలం. సింగీతం వారి ‘మార్కు’ సినిమా అంతటా కనిపిస్తుంది.

నాగఅశ్విన్, స్వప్నదత్, వైజయంతి వారు తొలి నుంచి ఉత్తమాభిరుచిగల, ప్రయోజన వంతమయిన, సామాజికాంశాలతో కూడిన వ్యాపారాత్మక సినిమాలు చేస్తున్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ ఇందుకు ఉదాహరణ. ఇప్పుడీ చిత్రం. నిజంగా వారి ధైర్య సాహసాలు కొనియాడదగినవి. సినిమా అంతటా ‘రిచ్ నెస్’, వారిశ్రమ కనిపిస్తుంది. సాంకేతిక విభాగం ఈ చిత్రం శతశాతం దేవిశ్రీ ప్రసాద్‌దే. ఆయన సంగీత ప్రతిభ ప్రశంసనీయం. మొత్తం కథనాన్ని సంగీతం ఆధారంగా నడిపించిన ఆయన వర్క్, డి. ఎస్. పి. కెరీర్ లోనే అత్యంత ప్రత్యేకం. సింగీతం వారు విసిరిన సవాల్‌ను దేవి సమర్ధవంతంగా స్వీకరించి అమలు చేశారు. అనుకూర్. సి సినిమాటోగ్రఫీ మరో ప్రధాన ఆకర్షణ. గ్రామీణ నేపథ్యం, ప్రకృతి అందాలు, ఫాంటసీ ఎలిమెంట్స్‌ను ఆయన ఎంతో నిపుణతతో తెరపై అందంగా ఆవిష్కరించారు.

ప్రకృతిపై ప్రేమకు భావోద్వేగ చిత్రణ

గౌరి పాత్రలో అహిల్యా బమ్రూ అద్భుతంగా నటించింది. కళ్ళతో ఆమె పలికించిన భావాలు తెరపై చూడాలి. ప్రకృతిపైన ప్రేమను ఎంతో భావోద్వేగంగా కనబరిచిన విధానం ‘దర్శకుడి’ మేథకు దర్పణం. అయాన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. శాలిని గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో బాగా చేసింది. బెనర్జీ తన అనుభవంతో పాత్రను రక్తికట్టించారు. పాత్ర నిడివి తక్కువయినా ‘నివేదా పేతురాజ్’ గుర్తుండిపోయే నటనతో మెప్పించింది. సినిమాలోని నేరేషన్‌కు కనెక్ట్ కావటం ఒక వర్గం ప్రేక్షకులకు కష్టం. ప్రథమ భాగంలో కొంత సాగినట్టుగా అనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. కాని.. తెలుగు చలనచిత్ర ప్రయాణంలో ఇటువంటి ప్రయోగాత్మక ప్రయత్నాలు రావటం సంతోషించదగ్గ అంశం. ఇందుకు నాగ్ అశ్విన్, స్వప్న దత్‌లను అభినందించాలి.

నటీనటులు: అహిల్యా బమ్రూ, అయాన్, బెనర్జీ, శాలిని కొండేపూడి, తులసి, నివేదా పెతురాజు

దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

నిర్మాణం: వైజయంతీ మూవీస్

విడుదల: థియేటర్స్‌లో

-భమిడిపాటి గౌరీశంకర్

94928 58395

Next Story