బ్లాక్ రెయిన్.. డేంజర్ అలర్ట్స్ జారీ

by Muthe.Rajitha |

రష్యా రాజధాని మాస్కోలో నల్లటి వర్షం(Black rain) కురవడం సంచలనం రేపింది.

బ్లాక్ రెయిన్.. డేంజర్ అలర్ట్స్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్ : రష్యా రాజధాని మాస్కోలో నల్లటి వర్షం(Black rain) కురవడం సంచలనం రేపింది. మాస్కోలోని కీలక ఆయిల్ రిఫైనరీలతో పాటు ఇతర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌ గురువారం నాడు వందలాది డ్రోన్లతో దాడికి పాల్పడింది. అయితే, ఈ దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే మాస్కో పరిసర ప్రాంతాల్లో నల్లటి వర్షం కురవడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

దాడుల అనంతరం భయానక పరిస్థితులు

ఉక్రెయిన్ వైమానిక దాడుల తర్వాత కురుస్తున్న ఈ వర్షం సాధారణ నీటి వర్షం కాదని, ఇదొక రకమైన నల్లటి బూడిదతో కూడిన కలుషిత వర్షమని స్థానికులు చెబుతున్నారు. బ్లాక్ రెయిన్ కారణంగా ప్రజల్లో తీవ్రమైన తలనొప్పి, శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయి. నగరంలోని నివాస భవనాలు, రోడ్లపై ఆపి ఉంచిన వాహనాలపై నల్లటి మచ్చల దట్టంగా పేరుకుపోతున్నాయి. కాగా ఇటువంటి రసాయన బూడిద వర్షాలు పర్యావరణానికి, మానవాళికి అత్యంత ప్రమాదకరమని స్థానిక వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

హెచ్చరికలు జారీ

పరిస్థితి తీవ్రతను గమనించిన మాస్కో నగర అధికారులు ప్రజలకు పలు కీలక సూచనలు జారీ చేశారు. నల్లటి వర్షం కురుస్తున్నందున ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, తలుపులు, కిటికీలు పూర్తిగా మూసి ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఆస్తమా వంటి ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎమెర్జెన్సీ అలర్ట్స్ జారీ చేశారు.

4 ఎయిర్పోర్టులు మూసివేత.. 500 పైగా విమానాలు రద్దు

రష్యాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి కావడంతో మాస్కోలో తీవ్ర ఆందోళన నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా మాస్కో నగర పరిధిలోని విమానాశ్రయాలన్నింటినీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఎయిర్‌పోర్టుల మూసివేత కారణంగా అంతర్జాతీయ, దేశీయ రూట్లకు సంబంధించిన దాదాపు 500కు పైగా విమాన సర్వీసులు పూర్తిగా రద్దయినట్లు రష్యా అధికారులు అధికారికంగా ప్రకటించారు.

Next Story