- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల సొంతింటి కల నెరవేరేదెప్పుడు..?
ప్రభుత్వాలు మారుతున్నా పేదల సొంతింటి కల మాత్రం నెరవేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ, మాచారెడ్డి : ప్రభుత్వాలు మారుతున్నా పేదల సొంతింటి కల మాత్రం నెరవేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నప్పటికీ, ఆ హామీలు ఆచరణలోకి వచ్చే సరికి పలు అడ్డంకులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియ వేగం పుంజుకోకపోవడం, గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో పేదల సొంతింటి కల ప్రశ్నార్థకంగా మారింది.
అసంపూర్తి భవనాలు... ఆవిరైన ఆశలు..
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట గ్రామ శివారులో కామారెడ్డి–సిరిసిల్ల ప్రధాన రహదారి పక్కన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణాలు పూర్తవుతాయని పేదలు ఆశించినప్పటికీ, రెండున్నర సంవత్సరాలు గడిచినా పనులు పూర్తి కాలేదు. భారీ వ్యయంతో నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం తలుపులు, కిటికీలు లేక నిరుపయోగంగా మారుతున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించిన నిర్మాణాలు ఇలా ఖాళీగా ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలయ్యే ప్రమాదం..
జనావాసాలకు కొంత దూరంలో ఉన్న ఈ అసంపూర్తి భవనాలు ప్రస్తుతం నిర్మానుష్యంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని వారు కోరుతున్నారు.
చరిత్ర మళ్లీ పునరావృతమా..?
ఇదే ప్రదేశంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో పేదల కోసం పెంకుటిళ్లు నిర్మించినప్పటికీ వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో అవి శిథిలావస్థకు చేరి కూలిపోయాయి. అనంతరం అదే స్థలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినా అవి కూడా పూర్తి కాకపోవడంతో పాత పరిస్థితులే మళ్లీ పునరావృతమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్థల దోషమా... ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యమా..?
ఒకే స్థలంలో రెండు ప్రభుత్వాలు పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టినా రెండుసార్లూ లబ్ధిదారులకు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది స్థల దోషమా, లేక ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు స్థానికుల్లో తలెత్తుతున్నాయి. పేదల కోసం ఉద్దేశించిన గృహ పథకాలు అసంపూర్తి కట్టడాలుగా మిగిలిపోవడం బాధాకరమని వారు అంటున్నారు.
ప్రభుత్వం స్పందించాల్సిన సమయం..
పేదల కోసం నిర్మించిన ఇళ్లు శిథిలాలుగా మారకముందే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణాలను పూర్తిచేయాలని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. లేనిపక్షంలో మరోసారి కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కావడంతో పాటు పేదల సొంతింటి కల మరోసారి కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.






