తలకొండపల్లిలో అసంపూర్తి ఇందిరమ్మ ఇండ్లకు గ్రహణం వీడేదెప్పుడు..?

by Ratna Kumari |   (  Updated:2026-06-29 12:58:33  IST  )

పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం తలకొండపల్లి మండలంలో మిశ్రమ ఫలితాలను ఇస్తోంది.

తలకొండపల్లిలో అసంపూర్తి ఇందిరమ్మ ఇండ్లకు గ్రహణం వీడేదెప్పుడు..?
X

దిశ, తలకొండపల్లి : పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం తలకొండపల్లి మండలంలో మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. మండలానికి మొత్తం 585 ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకాగా, వాటి నిర్మాణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.12 కోట్ల 37 లక్షల 40 వేల మేర నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. అయినప్పటికీ కొంతమంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించకపోవడం అధికారులను, నిజమైన అర్హులను ఆందోళనకు గురిచేస్తోంది. మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 115 ఇండ్లు బేస్‌మెంట్ దశను పూర్తి చేసుకోగా, ఇందుకు సంబంధించి రూ.4 కోట్ల 67 లక్షలు విడుదలయ్యాయి. అలాగే 76 ఇండ్లు గోడల దశకు చేరుకోగా రూ.3 కోట్ల 60 లక్షలు, మరికొన్ని ఇండ్లు ముగ్గు పోసి ప్రారంభ దశలో ఉండగా, 51 ఇండ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ, 41 ఇండ్ల నిర్మాణాలు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అన్నట్లుగా కొందరు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి చూపకపోవడంతో పథకం లక్ష్యం దెబ్బతింటోందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మండలంలోని పలు గ్రామాల్లో వందలాది మంది నిజమైన పేదలు, అర్హులు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పటికే మంజూరైన ఇండ్లను నిర్మించకుండా కాలయాపన చేస్తున్న లబ్ధిదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిర్మాణాలు చేపట్టని వారిని గుర్తించి, వారి స్థానంలో ఇల్లు నిర్మించుకునే ఆసక్తి ఉన్న అర్హులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, అధికారులు పర్యవేక్షణ చేస్తున్నా, ఇంకా 41 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఎందుకు ప్రారంభం కాలేదు? అసంపూర్తి ఇండ్లకు గ్రహణం ఎప్పుడు వీడుతుంది? నిజమైన అర్హుల సొంతింటి కల ఎప్పుడు నెరవేరుతుంది? అనే ప్రశ్నలు మండల వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

Next Story