- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీసర విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం..
ఇంటి నిర్మాణానికి విద్యుత్ మీటర్ కోసం వెళితే... నిబంధనల పేరుతో విద్యుత్ శాఖ అధికారులు బెంబేలేత్తిస్తారు.

దిశ, మేడ్చల్ బ్యూరో/ కాప్రా: ఇంటి నిర్మాణానికి విద్యుత్ మీటర్ కోసం వెళితే... నిబంధనల పేరుతో విద్యుత్ శాఖ అధికారులు బెంబేలేత్తిస్తారు. ఇంటి నిర్మాణం దశలో ఉంది కాబట్టి కమర్షియల్ మీటర్ తీసుకోవాలని, మీ ఇంటికి దగ్గరలో విద్యుత్ స్తంభాలు లేకపోవడం వలన కొత్త స్తంభాలకు ఎస్టిమేషన్ వేస్తామని, ఆ డబ్బులు కడితే స్తంభాలు వేస్తామంటారు. కేవలం 100, 200 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి మీటర్ల విషయంలో సవా లక్ష నిబంధనలు చెప్పే విద్యుత్ శాఖ అధికారులు.... కీసర సబ్ డివిజన్ లో మాత్రం ఎలాంటి నిబంధనలు ఉండకపోవడం గమనార్హం. రియాల్టర్లతో కుమ్మక్కైన ఇక్కడి విద్యుత్ శాఖ అధికారులు అవినీతి అక్రమాలు విస్తుగోల్పుతున్నాయి. విద్యుత్ శాఖకు రావలసిన ఆదాయానికి గండి కొడుతూ.... అధికారులు తమ జేబులను నింపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా కీసర సబ్ డివిజన్ సెక్షన్ లోనే గత రెండేళ్లుగా సుమారు రూ.7 కోట్ల వరకు ఆదాయానికి గండి కొట్టారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
వెంచర్లే... ఆదాయ వనరులు..
కీసరలో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న పలు వెంచర్లకు ట్రాన్స్ఫార్మర్ల నుంచి విద్యుత్ స్తంభాల వరకు ఎలాంటి నిబంధనలను పాటించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఎస్టిమేషన్లు లేకుండానే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. రియాల్టర్లతో కుమ్మక్కై విద్యుత్ శాఖ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ఇక ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో... స్టోర్ నుంచి వచ్చే సామాగ్రిని సైతం తమ ఇష్టా రాజ్యానికి ఉపయోగిస్తున్నారు. అలాగే అక్రమ బిల్లులు పెడుతూ... అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అయితే ఈ అక్రమ వ్యహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో... ఇక్కడి ఏడిఈ, ఏఈ, సెక్షన్ కాంట్రాక్టర్ ల వ్యవస్థ ఇష్టా రాజ్యాంగా మారిపోయింది.
ఎస్టిమేషన్లు లేకుండానే చకచక పనులు...
కీసర, రాంపల్లి, కీసర దాయరా, రాంపల్లి దయారా, చీర్యాల, యాద్గార్ పల్లి, తదితర శివారు ప్రాంతాలలో గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో వెంచర్లు వెలుస్తున్నాయి. అయితే వెంచర్ల లో ఉండే ప్లాట్ల సంఖ్యను బట్టి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. అందుకు ఒక్క ఫ్లాట్ కు రెండు కిలో వాట్స్ మీటర్ చొప్పున మొత్తం వెంచర్ లో ఉన్న సంఖ్యను బట్టి కొత్త ట్రాన్స్ఫార్మర్ కు విద్యుత్ శాఖ అధికారులు అంచనా వ్యయాలు(ఎస్టిమేషన్స్) వేస్తారు. నిబంధనల ప్రకారం డబ్బులు కడితే ఆ వెంచర్ కు ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలను అధికారులు కాంట్రాక్టర్లతో వేయిస్తారు. అయితే ఇలాంటి నిబంధనలు తుంగలో తొక్కుతూ... కొత్త వెంచర్లకు ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండానే మరో వెంచర్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎల్ టి లైన్లను వేస్తున్నారు. ఇలాంటి సేవలు చేసినందుకు ఆ వెంచర్ రియాల్టర్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఏర్పడిన కొన్ని వెంచర్ల లో ఇండ్లు నిర్మాణం జరిగితే... ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ల పేరుతో ప్రతిపాదనలు పంపి కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేసిన సేవలకు సైతం విద్యుత్ అధికారులకు తృణమూ ఫలము ఇచ్చుకోవాల్సిందే. ఇక కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, విద్యుత్ స్తంభాల తొలగింపు ప్రక్రియలో సైతం ఇక్కడి ఏఈ అక్రమార్గాలను ఎంచుకున్నట్లు బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇక్కడ ఏ ఈ చేసే అన్ని పనులకు ఏడిఈ నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని ఆరోపణలు ఉన్నాయి.
మచ్చుకు కొన్ని అక్రమాలు..
రాంపల్లి లో కరుణాకర్ గౌడ్ అనే రియాల్టర్ చేసిన 40 ప్లాట్ల వెంచర్ కు ట్రాన్స్ఫార్మర్ కు ఎలాంటి అంచనా ప్రతిపాదనలు పెట్టకుండా పక్కనున్న డి టి ఆర్ నుంచి ఎల్ టి లైన్ మీదుగా విద్యుత్ సరఫరా ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాంపల్లి దాయారలో ఆదిత్యయాసులో గతంలో 13 స్తంభాలకు అనుమతి పొంది 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు ఎస్టిమేషన్ అయింది. ప్రస్తుతం ఉన్న ఏ ఈ మురళీకృష్ణ ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండా 52 విద్యుత్ స్తంభాలను వేసినట్లు సమచారం. కీసర దాయర లో సర్వేనెంబర్ 159 లో ఎలాంటి ఎస్టిమేషన్స్ లేకుండానే.... 11 పోల్స్ విద్యుత్ లైన్లను షిఫ్టింగ్ చేశారని తెలిసింది. లక్ష్మీనారాయణ వెంచర్లు ఉన్న ప్లాట్ల కంటే తక్కువ ప్లాట్లను చూపి తనకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్కు లబ్ధి చేకూరేలా ప్రతిపాదనలు పంపారు. ఇక డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సామాగ్రిని ఇష్ట రాజ్యాంగ వాడుకోవడం, ఈ సామాగ్రిని ఎక్కడ వాడుతున్నారో.. రికార్డులు చూపకపోవడం, బినామీ కాంట్రాక్టర్ తో కుమ్మకు కావడం ఇలాంటి తదితర ఆరోపణలు ఉన్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న రూ.2.80 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉండగా... ప్రస్తుతం ఉన్న ఏడిఈ ఆ బిల్లులన్నీ చకచకగా మంజూరు చేయడం అనుమానాలకు తావిస్తోంది.
బాలాజీ నగర్ లో ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్లు ఇష్టారాజ్యంగా ఏర్పాటు
బాలాజీ నగర్ లో ఓ కాంట్రాక్టర్ ఇంట్లో డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సామాగ్రిని నిల్వ ఉంచడం, పక్కదారిగా వాటిని ఇష్టారాజ్యంగా స్వప్రయోజనాలకు వాడుతున్నారు. వాస్తవానికి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సామాగ్రి ఏఈ పర్యవేక్షణలో ఉండాలి. ఇక్కడ అలాంటిది లేకపోవడం గమనార్హం. ఇక డిపార్ట్మెంట్ పనుల నిమిత్తం వ్యాన్ , ఆటోలకు అక్రమ బిల్లులు సృష్టించి లక్షల్లో పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
విజిలెన్స్ విచారణలో జాప్యంపై అనుమానాలు...
కీసర సబ్ డివిజన్ పరిధిలో ఏడి ఈ, ఏఈ అవినీతి అక్రమాలపై రెండు నెలల క్రితం విద్యుత్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అప్పటినుంచి విచారణ పేరుతో కేసును సాగదీస్తున్నట్లు ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. రెండు మాసాలు పూర్తయిన విచారణ నివేదిక అందకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విచారణ చివరి దశలో ఉంది. ఈ విషయమై విజిలెన్స్ ఎస్సై రమేష్ నాయుడు ను ‘దిశ’ ప్రతినిధి వివరణ కోరగా విచారణ చివరి దశలో ఉందని తెలిపారు. కేసు విచారణలో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన అంశాన్ని నేను బయటికి చెప్పలేనని, త్వరలో అధికారులకు నివేదిక అందజేస్తానని తెలిపారు.
కాపాడే ప్రయత్నం..
చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు కోట్ల రూపాయలలో విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొట్టిన అధికారులను రక్షించే పనిలో కొంత మంది ఉన్నతాధికారులు ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. గత రెండేళ్లుగా ఇక్కడి సెక్షన్లో... విద్యుత్ అధికారుల అవినీతి అక్రమాలు యాదేచ్ఛగా జరుగుతున్న.... ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. రియాల్టర్లతో కుమ్మక్కై అక్రమార్జాన్ని ధ్యేయంగా పనిచేస్తున్న ఈ అధికారులతో ఉన్నతాధికారులకు ఆమ్యామ్యాలు ముట్టడంతోనే వాళ్లు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. ఏది ఏమైనాప్పటికీ విద్యుత్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






