తిరుచానూరులో ఫ్లెక్సీల వివాదం.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

తిరుచానూరులో వైసీపీ, టీడీపీ మధ్య బ్యానర్ల రాజకీయం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వైసీపీ శ్రేణులు తిరుచానూరులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాయి...

తిరుచానూరులో ఫ్లెక్సీల వివాదం.. ఉద్రిక్తత
X

దిశ, తిరుచానూరు: తిరుచానూరులో వైసీపీ, టీడీపీ మధ్య బ్యానర్ల రాజకీయం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వైసీపీ శ్రేణులు తిరుచానూరులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే, ప్రస్తుతం తిరుచానూరు పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో, ఇక్కడ ఎలాంటి రాజకీయ బ్యానర్లు ఉంచకూడదంటూ పోలీసులు ముందస్తు ఆంక్షలు విధించారు.

పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ, జన్మదిన వేడుకల ఉత్సాహంలో వైసీపీ శ్రేణులు పలుచోట్ల బ్యానర్లను ఏర్పాటు చేశాయి. పవిత్ర ఉత్సవాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రచారం చేయడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఆ బ్యానర్లను వెంటనే తొలగించాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలో వైకాపా నాయకుడు హర్షిత్ రెడ్డి, తిరుచానూరు మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి సోదరుడు నరేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని, బ్యానర్లు తీయడానికి వీల్లేదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు గట్టిగా వ్యవహరించారు. నిబంధనల ప్రకారం బ్యానర్లను ఖచ్చితంగా తొలగించాల్సిందేనని పోలీసులు తేల్చి చెప్పారు. సుదీర్ఘ చర్చలు, ఉద్రిక్త పరిస్థితుల అనంతరం పోలీసుల ఆదేశాలకు లోబడి వైసీపీ నాయకులు అక్కడి నుంచి వెనుతిరిగారు. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

Next Story