మేము మాట్లాడలేక కాదు.. మాటల పంచాయితీకి ఇది వేదిక కాదు

by Ratna Kumari |

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ విమర్శలకు వేదిక కాదని, తాము మాట్లాడాలనుకుంటే చాలా విషయాలు మాట్లాడగలమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

మేము మాట్లాడలేక కాదు.. మాటల పంచాయితీకి ఇది వేదిక కాదు
X

దిశ, సంగారెడ్డి : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ విమర్శలకు వేదిక కాదని, తాము మాట్లాడాలనుకుంటే చాలా విషయాలు మాట్లాడగలమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వ్యాఖ్యానించారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన రివర్స్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కాంగ్రెస్ నాయకులకు అధికారంలోకి రాకముందే తెలుసని, ఇప్పుడు ప్రతి హామీ అమలులో జాప్యానికి గత ప్రభుత్వ అప్పులను సాకుగా చూపించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. "ఇంకెంతకాలం గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలం గడుపుతారు?" అని నిలదీశారు. తమ ప్రభుత్వం పదేళ్లలో సుమారు రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్ర ఆస్తులను పెంచిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లోనే రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

అప్పులు చేసినా అభివృద్ధికి బాటలు వేశాం..

అప్పులు చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పులను సాకుగా చూపుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందని చింతా ప్రభాకర్ విమర్శించారు. మాటలతో కాలం వెళ్లదీస్తే ప్రజలే తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని అన్నారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన పాలన ఏదో ప్రజలకు బాగా తెలుసని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరి పాలనను విశ్వసిస్తున్నారో బ్యాలెట్ బాక్స్ స్పష్టంగా చెబుతుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు.

Next Story