తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు : ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

by I. Sairam |

తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, కార్యకర్తలు దానికి సిద్దంగా ఉండాలని మాజీ సీఎం, డీఎంకే అధినేత పిలుపునిచ్చారు.

తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు : ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడులో మూడు లేదా ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని ఆ రాష్ట్ర మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి బెంజమిన్ ఆధ్వర్యంలో అన్నాడీఎంకేకు కార్యకర్తలు భారీ సంఖ్యలో డీఎంకేలో చేరిన సందర్భంగా ఆదివారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఒక బలహీనమైన మైనారిటీ ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. ఈ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోకపోవచ్చని, గతంలో తమ కూటమిలో ఉన్న పార్టీల మద్దతుతోనే అది నడుస్తోందని ఆయన అన్నారు. టీవీకే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రజా తీర్పును పొందలేకపోయిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మెజారిటీ మార్కును అందుకోలేక, కేవలం 108 స్థానాలకే పరిమితమైందని అన్నారు. తమ కూటమిలో భాగమైన కొన్ని పార్టీలు వ్యూహాత్మకంగా జరిపిన సర్దుబాట్లు, ఇస్తున్న మద్దతు వల్లే ఈ టీవీకే అనే వాహనం ఎలాగోలా ముందుకు సాగుతోందని ఎద్దేవా చేశారు. ఈ వాహనం ఏ జంక్షన్ వద్ద కంట్రోల్ తప్పి అకస్మాత్తుగా ఆగిపోతుందో ఎవరికీ తెలియదని అన్నారు. అందుకే తాము ఐదేళ్ల పాటు వేచి ఉండలేమని, ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చని, వెంటనే కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా

అన్నాడీఎంకేలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఐదురుగు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే కూడా అదే దారిలో నడిచారు. రవాణా శాఖ మాజీ మంత్రి ఎమ్ ఆర్ విజయభాస్కర్ సోమవారం అన్నాడీఎంకేకు రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీని వీడిని 6వ ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. కరూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సచివాలయంలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తన రాజీనామాను అందజేశారు. ఆయన త్వరలోనే సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరే అవకాశం కనిపిస్తోంది.

Next Story