ఇక ఈవీలు తప్పనిసరి!

by velandi.Saikiran |

ఈవీ కార్లను ప్రోత్సహించడంలో భాగంగా ఈ వాహనాలు కొనుగోలు చేసినవారికి 100 శాతం రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపును ప్రభుత్వం ప్రకటించింది.

ఇక ఈవీలు తప్పనిసరి!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈవీలు, సీఎన్‌జీ వాహనాలు అందుబాటులోకి వచ్చినా దేశంలో మెజార్టీ వెహికిల్స్.. ఇంకా పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలే. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి పెట్రోల్ స్థానంలో ఇథనాల్ ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉండగా, ఢిల్లీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి చమురు ఒత్తిడితోపాటు కాలుష్య నివారణ ప్రధాన ఎజెండాగా తీసుకుని ఈవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఇథనాల్‌తో నడిచే వాహనాలపై ఢిల్లీ పూర్తిగా నిషేధం విధించబోతున్నది. హైబ్రిడ్ వెహికిల్స్‌నూ ఎంకరేజ్ చేయడం లేదు. కేవలం ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాత్రమే కొనుగోలు చేయాలని, వచ్చే ఒకట్రెండు సంవత్సరాల్లో కేవలం ఈవీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఢిల్లీలో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కేవలం ఈవీ త్రీవీలర్లు(ప్యాసింజర్లు, గూడ్స్) రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటుందని, అలాగే, 2028 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేవలం ఈవీ టూవీలర్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుంటుందని వివరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తర్వాత ఈ నిర్ణయాలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, 2030 మార్చి 31వ తేదీ వరకు ఈ ఫ్రేమ్‌వర్క్ అమల్లో ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. క్రమంగా వాహన మార్కెట్లను ఈవీ రంగంతో భర్తీ చేయాలని, ఇందుకోసం సబ్సిడీలు, ఇన్సెంటివ్‌లు, పన్ను మినహాయింపులు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, రిజిస్ట్రేషన్‌ల డెడ్‌లైన్లను నిర్ణయించింది. ఈ పాలసీ అమలు చేయడానికి రూ. 7 వేల కోట్ల ఖర్చవుతుందని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ పాలసీలో భాగంగా ఢిల్లీలో 23 వేల ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సీఎం రేఖా గుప్తా సారథ్యంలో నిన్న ఢిల్లీ కేబినెట్ సమావేశమై సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో ఇక పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ త్రీవీలర్లు, టూవీలర్లు, ఎన్1 కేటగిరీ ట్రక్‌ల రిజిస్ట్రేషన్‌లు నిలిపేయాలని నిర్ణయించింది.

ఈవీ కార్లకు రోడ్‌ టాక్స్ మినహాయింపు

ఈవీ కార్లను ప్రోత్సహించడంలో భాగంగా ఈ వాహనాలు కొనుగోలు చేసినవారికి 100 శాతం రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపును ఢిల్లీప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర గరిష్టంగా రూ. 30 లక్షల వరకున్న కార్లకు ఇది వర్తిస్తుంది. బీఎస్-IV లేదా అంతకంటే పాత కార్లను స్క్రాప్ చేస్తే రూ. 1 లక్ష వరకు ఇన్సెంటివ్ అందనుంది.

ఈవీ కొనుగోళ్లపై సబ్సిడీలు

ఎలక్ట్రిక్ టూ వీలర్లు: పాలసీ అమల్లోకి వచ్చిన మొదటి ఏడాదిలో కొనుగోలు చేస్తే రూ. 30 వేల వరకు సబ్సిడీ అందుతుంది. రెండో ఏడాది రూ. 20 వేల వరకు, మూడో ఏడాదిలో రూ. 10 వేల వరకు సబ్సిడీ.

ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు: మొదటి ఏడాది రూ. 50 వేలు, రెండో ఏడాది రూ. 40 వేలు, మూడో ఏడాది రూ. 30 వేల వరకు సబ్సిడీ అందుతుంది.

ఎన్1 కేటగిరీ ఈవీ గూడ్స్ వాహనాలకు (గరిష్టంగా 3.5 టన్నులు): రూ. 1 లక్ష వరకు సబ్సిడీ అందుతుంది.

స్క్రాపింగ్ చేస్తే ప్రోత్సాహకాలు

* ఎలక్ట్రిక్ టూ వీలర్ స్క్రాప్ చేసిన యజమానికి రూ. 10 వేల ఇన్సెంటివ్ లభిస్తుంది.

* ఆటో యజమానులకు రూ. 25 వేలు, ప్రైవేట్ కార్లకు రూ. 1 లక్ష వరకు ప్రోత్సాహకం లభిస్తుంది.

* లైట్ కమర్షియల్ గూల్స్ వెహికిల్స్‌కు రూ. 50 వేల వరకు ఇన్సెంటివ్.

* గ్రామీణ సేవా వాహనాలకు రూ. 15 వేల ప్రోత్సాహకం ఉంటుంది.

స్కూల్ బస్సులు మార్చుకోవాల్సిందే

పాలసీ అమల్లోకి వచ్చిన రెండేళ్లలో స్కూళ్లు తమ బస్సుల్లో కనీసం 10 శాతం ఈవీలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. మూడేళ్లలో 20 శాతానికి ఈవీలు పెంచుకోవాలని, 2030 మార్చి 31కల్లా 30 శాతానికి పెంచుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం పాలసీలో పేర్కొంది.

ఇతర రాష్ట్రాలకూ ఉత్సాహం!

ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకూ ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది వరకు కొనుగోలుదారులు స్వచ్ఛందంగా ఈవీలు కొనుగోలు చేయాలని, శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించాలని ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. కానీ, ఢిల్లీ ఈవీలను కంపల్సరీ చేసింది. దశలవారీగా శిలాజ ఇంధన వాహనాలకు స్వస్తిపలికే నిర్ణయాలు తీసుకుంది. అందులోనూ సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, పాత వాహనాల స్క్రాపింగ్‌ చేస్తే ప్రోత్సాహకాలూ ప్రకటించి కొనుగోలుదార్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వీటి భారాన్ని పూర్తిగా భరించకుండా ఇథనాలు, సీఎన్‌జీ వాహనాలపై ఒకటి లేదా రెండు శాతం గ్రీన్ సెస్ విధించనుంది. ఇది ప్రాక్టికల్‌గా ఇంప్రెస్సివ్‌గా ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story