2 ఎకరాలకే ‘రైతు భరోసా’ నేడే రైతుల ఖాతాల్లోకి..!

by velandi.Saikiran |

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్​సీజన్​లో రైతులకు అందించే రైతుభరోసా ఆర్థికసాయం మంగళవారం శిల్పాకళా వేదికగా సీఎం రేవంత్​రెడ్డి విడుదల చేయనున్నారు.

2 ఎకరాలకే ‘రైతు భరోసా’ నేడే రైతుల ఖాతాల్లోకి..!
X

దిశ, తెలంగాణ బ్యూరో/చింతకాని: రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్​సీజన్​లో రైతులకు అందించే రైతుభరోసా ఆర్థికసాయం మంగళవారం శిల్పాకళా వేదికగా సీఎం రేవంత్​రెడ్డి విడుదల చేయనున్నారు. మొదటిరోజు 41.37 లక్షల మంది రైతుల ఖాతాలోకి రూ.2482.02 కోట్లు జమ కానున్నాయి. ఒక ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతుల కోసం రూ.878.94 కోట్లు, రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 26.72లక్షల మంది రైతుల కోసం రూ.1,603.08 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ సీజన్​లో 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు దశలవారీగా పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయశాఖ తెలిపింది. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జులై 5లోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని పట్టాదారు పాస్​బుక్, ఆధార్​కార్డు, బ్యాంకు అకౌంట్ వివరాలు అందజేస్తే చివరిరోజు వారికి పెట్టుబడి సాయం అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదట ఖమ్మం జిల్లా మధిరలో రైతుభరోసా ప్రారంభించాలని నిర్ణయం తీసుకోగా వర్షాల కారణంగా అక్కడ సభ రద్దయింది. సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో సభలో మార్పు జరిగింది. ప్రభుత్వం చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు లక్ష మందితో సభ నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు సభా ప్రాంగణంలో వరద నీరు చేరింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లను పరిశీలించారు. సభ నిర్వహించేందుకు అనుకూలంగా లేదని భావించిన ప్రభుత్వం జగన్నాథపురంలో రద్దుచేసి హైదరాబాద్‌కు వేదిక మార్చింది.

రైతు వేదికల్లో పాల్గొనాలి: తుమ్మల

వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వేదికను మార్చినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సభ ద్వారా సీఎం రేవంత్​రెడ్డి రైతుభరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే 2500 మంది రైతులు పాల్గొంటారని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సమీప రైతు వేదికలకు చేరుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Next Story